- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 16,17 తేదీల్లో యువజన సమ్మేళనం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో యువజన సమ్మేళనాన్ని ఈ నెల16,17 తేదీల్లో నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు.

- కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో నిర్వహణ
- ముఖ్య అతిథులుగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
- ఉద్యోగాల భర్తీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం
- మతోన్మాద రాజకీయాలతో లబ్ది పొందుతున్న బీజేపీ
- యువతను చైతన్యపర్చేందుకే యువజన సమ్మేళనం
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో యువజన సమ్మేళనాన్ని ఈ నెల16,17 తేదీల్లో నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు. ఆ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాజ్యసభ సభ్యులు ఏ.ఏ.రహీం పాల్గొంటారని తెలిపారు. ఆ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్‌పై దృష్టి పెట్టడం లేదనీ, యువ శక్తిని నిర్వీరం చేస్తున్నాయని విమర్శించారు. అందుకే యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్న తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 60 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఒక్క రైల్వే శాఖలోని 10 లక్షల ఖాళీలున్నాయని వివరించారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ లేకపోవటం వల్ల దళితులు, ఆదివాసీ గిరిజనులు, బీసీలు నష్టపోతున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమూ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం వహిస్తున్నదనీ, అధికారం చేపట్టిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసిందనీ, గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లను క్లియర్ చేసి తన ఖాతాలో వేసుకుంటున్నదని ఎత్తిచూపారు. రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించి దానికి నిధులు కేటాయించటం లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం లేదని తెలిపారు. నిరుద్యోగ భృతి హామీని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీ విషయంలో యువతను మోసం చేస్తున్న తీరును ఎండగట్టారు. యువత మానసిక, ఆర్థిక ఒత్తిళ్లకు తట్టుకోలేక వ్యసనాలకు అలవాటు పడుతున్న పరిస్థితి ఉందనీ, రాష్ట్రంలో రాజకీయ అండదండలతోనే డ్రగ్స్ దందా సాగుతున్నదని విమర్శించారు. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీలు లేవనీ, దీంతో ప్రపంచ క్రీడల్లో మన క్రీడాకారులు వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువ శక్తిని వాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. ప్రజా సమస్యలపైనా, నిరుద్యోగ సమస్యలపైనా యువత ఆలోచించకుండా చేసేందుకు బీజేపీ మతోన్మాద రాజకీయాలను తెరపైకి తెచ్చి యువతను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ది పొందుతున్న తీరును ఎండగట్టారు.ఈ నేపథ్యంలోనే యూత్ సమస్యలపై చర్చించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సమ్మెళనానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, యువజనరంగం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్, సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య, నాయకులు చంద్రమోహన్, జగదీశ్, జగన్ పాల్గొన్నారు.






