- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజైన్ లోపం.... కాలువలకు శాపం
మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ ఆధునీకరణ పనుల్లో డిజైన్ లోపం కాల్వలకు శాపంగా మారింది. మొదటి దశ ఆధునీకరణ

దిశ, వైరా: మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ ఆధునీకరణ పనుల్లో డిజైన్ లోపం కాల్వలకు శాపంగా మారింది. మొదటి దశ ఆధునీకరణ పనుల డిజైన్ కు బదులు తక్కువ వెడల్పుతో రెండో దశ ఆధునికరణ పనుల గైడ్ వాల్స్ డిజైన్ ను మార్చడంతో నల్ల రేగడి భూముల్లో ఆ గైడ్ వాల్స్ కూలిపోతున్నాయి. వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో గత రెండు నెలల క్రితం నల్లరేగడి భూమిలో ఏడమ కాలువకు నిర్మించిన గైడ్ వాల్స్ రెండు ప్రాంతాల్లో సుమారు 150 మీటర్లు కూలిపోయాయి. దీంతో పాత డిజైన్ ను మార్చి కొత్త డిజైన్ ను ఉన్నతాధికారులు ప్రవేశపెట్టడంతో సుమారు రూ.16 కోట్ల అభివృద్ధి పనుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. కాలువల ఆధునీకరణ డిజైన్ మార్చడం, నల్ల రేగడి భూమి కావడంతో విప్పలమడక గ్రామంలో గత 20 రోజుల క్రితం సుమారు 100 మీటర్ల దూరం, తాజాగా గురువారం గ్రామంలోని కళ్యాణ మండపం సమీపంలో సుమారు 50 మీటర్ల దూరం గైడ్ వాల్ కూలిపోయాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో డిజైన్ మార్చి ఎక్కువ దూరం కాలువలను ఆధునీకరణ చేయాలని ఉన్నతాధికారులు చేపట్టిన ప్రయోగం వికటించిందనే విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు విప్పమడక గ్రామంలోని వరద నీరు గైడ్ వాల్స్ కుపోటెత్తడంతో 8 అంగుళాల వెడల్పు ఉన్న వాల్ వరద తీవ్రతకు తట్టుకోలేక కూలిపోతుంది.
మొదటి దశ ఆధునికరణ డిజైన్ ఇదే
వైరా రిజర్వాయర్ మొదటి దశ ఆధునీకరణ పనులను 2009 సంవత్సరంలో చేపట్టారు. ఈ అభివృద్ధి పనుల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కృషితో జపాన్ బ్యాంకు నిధులు రూ. 50.43 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో కాల్వలో గైడ్ వాల్స్ నిర్మాణం కోసం బేస్మెంట్ మూడు అడుగుల వెడల్పు నిర్మించారు. అలా నిర్మించిన బేస్మెంట్ పై 1.5 అడుగుల మందంతో గైడ్ వాల్స్ నిర్మాణం చేపట్టారు. దీంతో అప్పుడు నిర్మించిన గైడ్ వాల్స్ పటిష్టంగా ఉన్నాయి. అయితే ఆ డిజైన్ కు బదులు ప్రస్తుతం ఆధునీకరణ పనుల డిజైన్లు మార్చడంతో గైడ్ వాల్స్ భవిష్యత్తుపై నీలి నీడలో అలముకున్నాయి.
33 కోట్ల అభివృద్ధి పనులకు డిజైన్ మార్పు
వైరా రిజర్వాయర్ రెండో దశ ఆధునీకరణ కోసం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కృషితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పట్టుబట్టి రూ. 33 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధుల్లో 16 కోట్ల రూపాయలతో కుడి కాల్వలో 6 కిలోమీటర్లు, ఎడమ కాలువలో 1.3 కిలోమీటర్ల దూరం గైడ్ వాల్స్ నిర్మించారు. అయితే గైడ్ వాల్స్ నిర్మాణానికి గతం కు భిన్నంగా రెండు అడుగుల వెడల్పులో బేస్మెంట్ నిర్మించారు. అదేవిధంగా ఆ బేస్మెంట్ పై కేవలం 8 అంగుళాల మందంతో గైడ్ వాల్ నిర్మించారు. మొదటి దశ ఆధునీకరణ పనులతో పోల్చుకుంటే బేస్మెంట్ ఒక అడుగు తక్కువ, గైడ్ వాల్స్ అప్పటికంటే సగం మందంతోనే నిర్మించారు. దీంతో ఈ గైడ్ వాల్స్ పొలాల్లో గ్రామాల్లో వరద నీరు పోటెత్తి కూలిపోతున్నాయి. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తక్కువ నిధులతో ఎక్కువ దూరం కాల్వలను అభివృద్ధి చేయాలని గత డిజైన్లు మార్చి కొత్త డిజైన్లు తయారు చేశారనే ఆరోపణ వినవస్తున్నాయి.
భారీ వర్షాలతో గైడ్ వాల్స్ పైకి ప్రవహిస్తున్న వరద నీరు
గత నెల రోజులుగా వైరా మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆధునీకరణ చేపట్టిన కుడి, ఏడమ కాలువ గైడ్ వాల్స్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అయితే కుడి కాలువలో సైడ్ వాల్స్ నిర్మించిన భూమి పటిష్టంగా ఉండటంతో ఇప్పటివరకు ఆ కాల్వలోని సైడ్ వాల్స్ కు ఎలాంటి ముప్పు ఏర్పడలేదు. తాటిపూడి గ్రామంలో గురువారం కాల్వ గైడ్ వాల్స్ పై నుంచి భారీ స్థాయిలో వరద నీరు కాలువలోకి చేరింది. కాల్వ గైడ్ వాల్స్ మునిగి వరద నీరు కాలువలో ప్రవహించింది. ఇలా భారీ వర్షాలు వస్తే తక్కువ మందంతో నిర్మించిన కుడి కాల్వ గైడ్ వాల్స్ భవిష్యత్ ఏమిటోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. విప్పలమడక గ్రామంలో ఏడమ కాలువ పరిధిలో నల్ల మట్టి భూమిలో నిర్మించిన గైడ్వాల్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాకుండా గ్రామంలో నుంచి వచ్చే వరద నీరు పోటెత్తడంతో తక్కువ మందంతో ఉన్న గైడ్ వాల్స్ పడిపోతున్నాయి. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాత డిజైన్ తోనే కాల్వల అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.






