చిన్న పంచాయతీల్లో పెద్ద కష్టాలు

by velandi.Saikiran |   (  Updated:2025-12-08 01:28:54  IST  )

రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీలుగా రికార్డులకెక్కిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని అడవిరామారం, దొంగతోగు

చిన్న పంచాయతీల్లో పెద్ద కష్టాలు
X

చిన్న పంచాయతీల్లో పెద్ద కష్టాలు

=అభివృద్ధికి ఆమడదూరంలోఅడవిరామారం, దొంగతోగు

=రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీలుగా గుర్తింపు

=నిత్యం సమస్యలతోనే ప్రజల సహవాసం

రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీలుగా రికార్డులకెక్కిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని అడవిరామారం, దొంగతోగు గ్రామ పంచాయతీలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తున్నాయి. అడవిరామారం, దొంగతోగు పూర్తిగా ఆదివాసీ గిరిజన గ్రామాలే. వర్షాకాలమైతే ఈ గ్రామప్రజల పరిస్థితి దారుణంగా ఉంటోంది. పంచాయతీ పరిధిలో ఉన్న వాగులు పొంగితే ఎక్కడివారు అక్కడే ఉండే పరిస్థితి నెలకొంది. వైద్యం కోసం నానాతిప్పలు పడాల్సిందే. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యానికి గురైతే 108రావాలంటే గంటల తరబడి ఎదురుచూడాల్సిందే. ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలంటే వైద్య సామాగ్రిని తరలించాలంటే తలకుమించిన భారంగా మారుతోంది. దశాబ్దాలుగా ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోక, సౌకర్యాలు లేక ప్రజలు నిత్యం సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని నిధులు విడుదల చేసినా కానీ ఈ గ్రామాల్లో అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసి అవి బాహ్యా ప్రపంచానికి దూరంగా ఉంటున్నాయి.

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : తండాలు, గూడేలను పంచాయతీలుగా చేసిన గత ప్రభుత్వం వాటి అభివృద్ధిని మరిచింది. చిన్న పంచాయతీలు అభివృద్ధికి కేంద్రాలుగా మారుతాయనుకుంటే కనీస సౌకర్యాలు కూడా నోచుకోని గ్రామాలు మిగిలిపోతున్నాయి. పంచాయతీలుగా మారిన ఇప్పటి వరకు ప్రజల స్థితిగతులు, రోడ్, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు గుప్పించి గెలిచిన తర్వాత ఆ గ్రామాలను, ప్రజలను, ఆ ప్రాంతం వైపు ముఖం చాటేస్తున్నారు. దీంతో ఆ గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. విద్య, వైద్య, రవాణా సదుపాయాలకు దూరమవుతున్నాయి. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసి అవి బాహ్యా ప్రపంచానికి దూరంగా ఉంటున్నాయి.

అడవిరామారంలో అనేక సమస్యలు..

రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని అడవిరామారంగా రికార్డులకెక్కింది. గతంలో ఇదే మండలంలో దొంగతోగు గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీగా ఉండేది కానీ, ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరగడంతో దొంగతోగు రెండో స్థానంలో నిలిచి, అడవిరామారం పంచాయతీ మొదటిస్థానం ఆక్రమించింది. అడవిరామారం, దొంగతోగు పూర్తిగా ఆదివాసీ గిరిజన గ్రామాలే. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ఈ గ్రామాలు ప్రస్తుతం రెండో ఎన్నికల సంగ్రామం ముందు నిలబడ్డాయి. అయినా ఐదుసంవత్సరాలుగా అభివృద్ధి మాత్రం నత్తనడకగానే ఉంది. అడవిరామారం గ్రామపంచాయతీ ఆళ్లపల్లి మండల కేంద్రానికి 25కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా నాలుగు వార్డులు ఉండగా మొత్తం ఓటర్లు 85ఓటర్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 45, మహిళలు 40మంది ఉన్నారు. ఇక దొంగతోగు గ్రామపంచాయతీ విషయానికి వస్తే మండలకేంద్రానికి 15కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ(పురుషులు/మహిళలు) రిజర్వ్ కాగా 4వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 88 మంది కాగా పురుషులు 48, మహిళా ఓటర్లు 40మంది ఉన్నారు.

ఈ రెండు పంచాయతీలలో పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామాలుగానే ఉన్నాయి. ఇక వర్షాకాలమైతే ఈ గ్రామప్రజల పరిస్థితి దారుణంగా ఉంటుంది. పంచాయతీ పరిధిలో ఉన్న వాగులు పొంగితే ఇక ఎక్కడివారు అక్కడే ఉండే పరిస్థితి నెలకొంది. ఇక వైద్యం కోసం నానాతిప్పలు పడాల్సిందే. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యానికి గురైతే 108రావాలంటే గంటల తరబడి ఎదురుచూడాల్సిందేనని, ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలంటే వైద్య సామాగ్రిని తరలించాలంటే తలకుమించిన భారంగా మారుతోంది. దశాబ్ధాలుగా ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోక, సౌకర్యాలు లేక ప్రజలు నిత్యం సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని నిధులు విడుదల చేసిన కానీ ఈ గ్రామాల్లో అభివృద్ధి మచ్చుకైనా కానరాకపోవడంపై ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఈ రెండు పంచాయతీలను, వార్డులను కూడా ఏకగ్రీవం చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఏకగ్రీవం కోసం కుస్తీలు, పథకాలు రచిస్తున్న నాయకులు అభివృద్ధి విషయంలో కూడా ప్రణాళికలు చేస్తే ప్రజల స్థితిగతులు, గ్రామ రూపురేఖలు మారుతాయంటున్నారు స్థానిక ప్రజలు.

వెంకటేష్ కాలనీ పరిస్థితి వింత పరిస్థితి

చిన్న పంచాయతీలలో మరొకటి చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్ కాలనీ. ఈ పంచాయతీలో మొత్తం ఎస్టీ(మహిళా/పురుషుడు) సర్పంచ్ స్థానంతో పాటు 4వార్డులు ఇండగా మొత్తం 183 మంది ఓటర్లు ఉన్నారు. అసలు ఇక్కడ వెంకటేష్ ఖని పంచాయతీ అనే ఊరు ఉంది. కానీ ఓటర్లెవరూ ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉండటం లేదు. ఓసీ విస్తరణతో ఈ గ్రామమే కనుమరుగైంది. కానీ అధికారులు ఈ పంచాయతీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఇటీవల ఓసీని విస్తరించడంతో ఈ పంచాయతీలోని ప్రజలను ఖాళీ చేయించి వారికి కొత్తగూడెం పట్టణంలోని గంగాబిషన్ బస్తీలో స్థలాలను కేటాయించింది. స్థలాలు కేటాయించినప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకపోవడంతో ఈ పంచాయతీ ప్రజలు సొంతంగా ఇళ్ళు నిర్మించుకునే పరిస్థితి లేక తలోదిక్కు కుటుంబాలతో సహా ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. అధికారులు ఎన్నికలు నిర్వహిస్తునందున ఈ ప్రాంత ప్రజలు ఎన్నికల బరిలో నిలబడ్డారు. ప్రస్తుతం ఇక్కడ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, తమకు వసతులు కల్పించాలనే డిమాండ్‌తో బరిలో నిల్చున్నారు. ఎన్నికల సమయానికి వెంకటేష్ ని పంచాయతీలో కేటాయించిన ఓటింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వస్తారని ఓటర్లు చెబుతున్నారు. 'గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు' అని ప్రతీ సందర్భంలో ప్రజాప్రతినిధులు, మేధావులు పల్లెవేస్తున్న మాటలను వాస్తవరూపంలోకి తీసుకువచ్చి అభివృద్ధి బాటపట్టించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story