భారత్ ఫీల్డ్ టైగర్ ‘హార్వెస్టర్ ఫైనాన్స్’ కుంభకోణం

by Thanuru Gopichand |   (  Updated:2025-10-26 05:58:50  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగులా వెలిసిన భారత్ ఫీల్డ్ టైగర్ హార్వెస్టర్ డీలర్ ఫైనాన్స్ కుంభకోణానికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి.

భారత్ ఫీల్డ్ టైగర్ ‘హార్వెస్టర్ ఫైనాన్స్’ కుంభకోణం
X

దిశ, వైరా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగులా వెలిసిన భారత్ ఫీల్డ్ టైగర్ హార్వెస్టర్ డీలర్ ఫైనాన్స్ కుంభకోణానికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. ఈ భారత్ హార్వెస్టర్ డీలర్ నిర్వాహకులు ఫైనాన్స్ కోసం తప్పు మీద తప్పు చేసి జాతీయ బ్యాంకులనే బురిడీ కొట్టించారనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో తాడేపల్లిగూడెంకు చెందిన డీలర్ పుల్లారావు పాత్రధారుడిగా, బ్యాంకు ఉద్యోగులు సూత్రధారులుగా మారారని తెలుస్తోంది. ఇప్పటికే భారత్ హార్వెస్టర్ కు అక్రమంగా జిఎంఆర్ హార్వెస్టర్ పేరుతో ఫైనాన్స్ చేసినట్లు బ్యాంక్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సదరు బ్యాంకు రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ పారదర్శకంగా జరిగితే బ్యాంకును చీటింగ్ చేసిన డీలర్ తో పాటు బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాడేపల్లిగూడెంకి చెందిన డీలర్ గత రెండు నెలల క్రితం భారత్ ఫీల్డ్ టైగర్ హార్వెస్టర్ పేరుతో ట్రాక్ హార్వెస్టర్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చారు. చైనా నుంచి దిగుమతి చేసిన ఈ భారత్ హార్వెస్టర్ కు భారతదేశంలో కనీస అనుమతులు కూడా లేవు. బుదిని అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్ అనుమతి లేకుండానే ఈ హార్వెస్టర్లను ఖమ్మం జిల్లాలో సదరు డీలర్ బుకింగ్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకుతో పాటు పలు బ్యాంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఈ హార్వెస్టర్ కు ఫైనాన్స్ చేయించారు. ఈ విషయమై గత నెలలో దిశలో అనేక వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. బుదిని అగ్రికల్చర్ టెస్టింగ్ సెంటర్ అప్రూవల్ ఉన్న జిఎంఆర్ పేరుతో భారత హార్వెస్టర్ కు ఫైనాన్స్ అప్పట్లో చేయించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో సదరు డీలర్ మరో దొడ్డిదారిని ఎంచుకున్నారు.

భారత్ హార్వెస్టర్ కు ఉన్న భారత్ స్టిక్కర్లను తొలగించి ఆ స్థానంలో జిఎంఆర్ స్టిక్కర్లను ఏర్పాటు చేసి ఫైనాన్స్ లు చేయించి హార్వెస్టర్లను విక్రయించారని తెలుస్తోంది. ఇలా చీటింగ్ కు పాల్పడి ఇప్పటికే సుమారు 20 హార్వెస్టర్లకు బ్యాంకులు నుంచి సుమారు రూ.3 కోట్లు ఫైనాన్స్ చేయించి డెలివరీ చేశారని సమాచారం. నెల్లూరుకి చెందిన జిఎంఆర్ హార్వెస్టర్ కు బుదిని టెస్టింగ్ టెస్ట్ రిపోర్ట్ ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి గ్యాం హార్వెస్టర్ ను కాపీ చేసి డూప్లికేట్ గా వచ్చిన భారత్ హార్వెస్టర్ పై జిఎంఆర్ స్టిక్కర్లు వేస్తున్నారు. ఇలాంటి మోడల్ హార్వెస్టర్ కూడా జిఎంఆర్ సంస్థకు బుదిని అప్రూవల్ లేదు.

ఛాయిస్ నెంబర్లు, ఇంజన్ నెంబర్లను చైనా నుంచి దిగుమతి చేసిన హార్వెస్టర్ల వివరాలతో ఉండే ఇన్వాయిసులను పరిశీలిస్తే ఈ బాగోతం బహిర్గతం అవుతుంది. నెల్లూరుకు చెందిన జిఎంఆర్ హార్వెస్టర్ నిర్వాహకులు భారత్ హార్వెస్టర్ పై తమ స్టిక్కర్ వేసుకునేందుకు అనుమతించడానికి ఒక్కో హార్వెస్టర్ కు లక్ష రూపాయలు తీసుకొన్నట్లు తెలుస్తోంది. హార్వెస్టర్ రంగంలో భారత్ హార్వెస్టర్ డీలర్ ఇంత చీటింగ్ కు పాల్పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

హెచ్డిఎఫ్సి బ్యాంకులో కొంతమంది ఉద్యోగులను మచ్చిక చేసుకున్న డీలర్ ఈ వ్యవహారాన్ని అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ హార్వెస్టర్లకు జిఎంఆర్ స్టిక్కర్లు వేసి ఏ ఫైనాన్స్ లో యజమానులకు ఎంత ఫైనాన్స్ ఇచ్చారనే వివరాలు దిశ చేతికి అందాయి. ఈ వివరాలతో సదరు బ్యాంకుల అధికారులకు పలువురు రైతులు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి భారత్ జిఎంఆర్ హార్వెస్టర్ల డీలర్ల చీటింగ్ పై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story