Bhadradri: నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

by velandi.Saikiran |

భద్రాచలం పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ జరగనున్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

Bhadradri: నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
X

భద్రాద్రికి బ్రహ్మోత్సవాల శోభ

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ముస్తాబైన దివ్యక్షేత్రం

ఈ నెల 27న కల్యాణం, 28న పట్టాభిషేకం

ముఖ్యమంత్రి పర్యటన ఖరారు

భద్రాచలం పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ జరగనున్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భాగంగా ఈనెల27న శ్రీరామనవమిని పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం వీక్షించడానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పట్టణ ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రానుండగా అధికారులు ఆ దిశగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

దిశ భద్రాచలం: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వ తేది వరకూ జరగనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల27న శ్రీరామ నవమిని పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం, 28 న పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రామయ్య కల్యాణం వీక్షించడానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారామచంద్ర స్వామి వారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో, చాందిని వస్త్రాలు, చలువ పందిళ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పట్టణ ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకుని రానుండటంతో అధికారులు ఆ దిశగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 2లక్షల లడ్డు ప్రసాదం, 5లక్షల ప్యాకెట్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాలలోని భక్తుల సౌకర్యం కోసం కల్యాణ టికెట్స్ ఆన్‌లైన్‌లో ఉంచారు. రామాలయం అధికారులు ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రముఖులను ఆహ్వానించారు.

బ్రహ్మోత్సవాలు ఇలా...

భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభం కానున్న శ్రీరామ నవమి తిరుకల్యాణోత్సవాలలో భాగంగా గురువారం ఉగాది పండుగను పురస్కరించుకొని ఉదయం ఉగాది ప్రసాద వితరణ, 9 గంటల నుంచి ఉత్సవ ఆరంభం, ఋత్విక్ వరణం, రక్షాబందనం, స్నపనతిరుమంజనం, సాయంత్రం మృత్సమ్గ్రహణం, స్వామి వారికి కల్పవృక్ష వాహనంపై తిరువీధి సేవ, నూతన పంచాంగ శ్రవణం, ఉత్సవ అంకురార్పణ జరుగుతుంది. అనంతరం 23వ తేదీన మండల లేఖ, కుండ, కలశ, యాగశాల అలంకరణ, స్వామి వారికి సార్వబౌమ సేవ నిర్వహిస్తారు. 24న ఉదయం గరుడ ధ్వజ పట లేఖనం, సాయంత్రం గరుడ ధ్వజ పటావిష్కరణ, స్వామివారికి గరుడ ద్వజాదివాసం జరుగుతుంది. 25న ఉదయం అగ్నిప్రతిష్ట, ద్వజారోహనం, సాయంత్రం భేరి తాడనం, దేవతాహ్వానం, బలి సమర్పణము, రాత్రి స్వామి వారికి హనుమద్ వాహన సేవ, 26న ఉదయం యాగశాల పూజ, చతుస్తానార్చన, రాత్రి స్వామి వారికి గజ, గరుడ వాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 27న శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 10.30 నుండి 12.30 వరకూ శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరపనున్నారు. సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం, రాత్రి స్వామి వారికి చంద్ర ప్రభ వాహన సేవ జరుగుతుంది. 28న ఉదయం మహా పట్టాభిషేకం, రాత్రి స్వామి వారికి రథోత్సవం జరుగుతుంది. 29న మహాదాశీర్వచనం, 30న తెప్పోత్సవం, చోరోత్సవం, 31న ఊంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, హావనం, 2న ఉదయం చక్రతీర్థం, సాయంత్రం పూర్ణహుతి, శేష వాహన సేవ, ద్వజావరోహణం, దేవాతోద్వాసన, ద్వాదశ ప్రదక్షిణలు, ఆరాధనలు, శ్రీపుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Next Story