- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.

దిశ, వైరా : ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మంగళవారం వైరా నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. వైరా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్, ఓపి రూమ్, ల్యాబ్, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల వివరాలను ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోజువారీ కేసుల వివరాలు, ముఖ్యమైన రిజిస్టర్లు, నెలవారీ నివేదికలను, ఔషధాల లభ్యత, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, సేవలు మరింత నాణ్యంగా అందేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తే ఎక్కువ మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని తెలిపారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అనవసరపు సి-సెక్షన్ ఆపరేషన్ చేయవద్దని అన్నారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
వార్డ్ లో కేసు షీట్ లను పరిశీలిస్తూ రోగులకు అవసరమైన ఔషధాల లభ్యతపై ప్రత్యేకంగా విచారించి, అన్ని రకాల అవసరమైన మందులను తగిన స్థాయిలో నిల్వ ఉంచాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచి, రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అన్నారు. అంతకు ముందు వైరా మండలం కేంద్రంలో నూతనంగా రూ. 37.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవన నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుర్తించిన ప్రాధాన్యత పనులు త్వరితగతిన నాణ్యత తో పూర్తి చేయాలని, జిల్లా యంత్రాంగం పనుల పూర్తిలో సమన్వయ సహకారం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం వైద్య రంగాల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నదని తెలిపారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని అన్నారు. పనుల నాణ్యతపై ఎటువంటి రాజీ ఉండకూడదని, ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలస్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన వనరులు సమకూర్చుకుని, నిర్ణీత గడువులోపే పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డిసిహెచ్ఎస్ డా.రాజశేఖర్ గౌడ్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.






