మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. మూడు రోజులు దాకా నీరు విడుదల చేయను

by Kodari Anjali |

వైరా నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి పనితీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుంది.

మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. మూడు రోజులు దాకా నీరు విడుదల చేయను
X

దిశ, వైరా: వైరా నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి పనితీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుంది. సుమారు 13 సంవత్సరాలుగా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి వ్యవహరిస్తున్న వివాదపు తీరు రైతాంగానికి శాపంగా మారుతుంది. వైరా రిజర్వాయర్ ఎడమ కాల్వకు మూడు రోజులు వరకు సాగునీరు విడుదల చేయనని, మీరు ఎవరికి చెప్పకుంటారో చెప్పుకోండి అంటూ సదరు అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వెంటనే నీటిపారుదల శాఖ వైరా డీఈ నాగ బ్రహ్మయ్య కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థగంట లోపు ఎడమ కాల్వకు నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైరాలోని కుడి కాల్వ హెడ్ స్లుయిస్ వద్ద సోమవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కాంగ్రెస్ నాయకులతో కలిసి సాగునీటిని నారుమళ్ళకు విడుదల చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అక్కడ ఉన్న డీఈ నాగ బ్రహ్మయ్యను ఎడమ కాల్వకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆదేశించారు. అయితే ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేయకుండా జేఈ అడ్డుకున్నారు.

నీరు విడుదల చేసే ప్రసక్తే లేదు..

దీంతో వైరా మండలానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి జేఈ వద్దకు వెళ్లి వెంటనే సాగునీరు ఎడమ కాల్వకు విడుదల చేయాలని కోరారు. ఎడమ కాల్వలో పూడిక తీయాలని మూడు రోజులు దాకా సాగునీరు విడుదల చేయనని ఆమె స్పష్టం చేశారు. గత 10 రోజులుగా పూడిక తీయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు ప్రజా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆమె మీరు ఎవరికీ చెప్పకుంటారో చెప్పుకోండి.. మూడు రోజులు దాకా నీరు విడుదల చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వెంటనే వైరా డీఈ నాగబ్రహ్మయ్యకి ఫోన్ చేసి అర్ధగంటలోపు ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో డీఈ ఆగ మేఘాల మీద ఎడమ కాల్వ హెడ్ స్లుయిస్ వద్దకు వెళ్లి సాగునీటిని విడుదల చేయించారు. ఎమ్మెల్యే సాగునీటి విడుదల కార్యక్రమానికి సదరు జేఈ డుమ్మా కొట్టారు. ఆమె కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. ఎమ్మెల్యే సాగునీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఆమె కార్యాలయంలోనే ఉన్నారు.

మిగిలిన ఎడవ కాల్వ పనులతో పాటు..

ఈ విషయమై పలువురు డీఈను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈనెల 3వ తేదీన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతులతో సాగునీటి విడుదల విషయమై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారం రోజుల్లో కుడి ఎడమ కాల్వల పూడికతీత పనులు పూర్తి చేస్తామని ఈఈ బాబురావు, అప్పటి డీఈ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే అధికారులు ఆ తర్వాత పూడిక తీత పనులు మరిచారు. అయితే ఈ విషయమై దిశలో వార్తా కథనం ప్రచురితం కావడంతో గత రెండు రోజుల క్రితం విప్పలమడకలోని చీలువ కాలువ నుంచి గరికపాడు వెళ్లే కాల్వ పూడికతీత పనులు చేపట్టారు. మిగిలిన ఎడవ కాల్వ పనులతో పాటు కుడి కాల్వ పూడికతీత పనులు చేపట్టకుండా వదిలేశారు. అయినప్పటికీ రైతులకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే సాగునీటిని విడుదల చేయించారు. నారుమళ్ళకు నీరు విడుదల చేసిన తరువాత కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒకవైపు మండల రైతాంగ అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే కృషి చేస్తుంటే నీటిపారుదల శాఖ అధికారుల్లో మాత్రం కనీస చలనం కరువవుతుంది.

Next Story