రైతు వ్యతిరేక ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి : మాజీ జడ్పీ చైర్మన్ కమల్ రాజ్

by Ratna Kumari |

రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి :  మాజీ జడ్పీ చైర్మన్ కమల్ రాజ్
X

దిశ, ఎర్రుపాలెం : రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతుల కష్టాలు పట్టించుకోని ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి స్పందించాలని అన్నారు. ఎర్రుపాలెం మండల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు, మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. రైతులు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పంటలను పోసి ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.


మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. ఒక ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా, ప్రభుత్వం మాత్రం 25 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. మిగిలిన పంటను రైతులు తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా రైతులు మొక్కజొన్నలను రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో పోసి ఉంచినా అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం బస్తాలు ఇవ్వాలి, కాటాలు వేయాలి, లారీలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలకు తరలించాల్సి ఉండగా, రైతులే తమ సొంత డబ్బులతో బస్తాలు కొనుగోలు చేసి, కాటాలు వేయించుకుని, టన్నుకు రూ.800 వరకు లారీ కిరాయి చెల్లించి పంటను తరలిస్తున్నారని విమర్శించారు. ట్రాన్స్‌పోర్ట్ సమస్యల వల్ల మార్కెట్ యార్డుల్లో ధాన్యం, మొక్కజొన్న కుప్పలుగా పేరుకుపోయి నాణ్యత దెబ్బతింటోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొక్కజొన్నలకు క్వింటాల్‌కు సుమారు రూ.150 వరకు నష్టం వస్తున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. రైతుల కష్టార్జిత ఫలితాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు.

ఇక వడ్ల కొనుగోలు పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు క్వింటాల్‌కు 10 కిలోల వరకు కటింగ్ చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి చివరకు సన్న వడ్లకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి రైతుల కష్టాలను గుర్తించి వెంటనే ధాన్యం మరియు మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని, లారీలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శీలం కవిత, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, మాజీ సర్పంచులు కోట శ్రీనివాసరావు, షేక్ బహదూర్, శీలం కృష్ణారెడ్డి, గోపవరం సర్పంచ్‌తో పాటు పార్టీ నాయకులు తిరుపతిరావు, బొర్రా నరసింహారావు,మందడపు చిన్న వెంకటేశ్వరావు,కాలసాని వెంకటనారాయణ, గుర్రాల రవి, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, వేణు, వెంకటరెడ్డి, వసంత్, నాగిరెడ్డి పాల్గొన్నారు.

Next Story