బినామీ ఫెర్టిలైజర్ షాపులపై ఉక్కుపాదం మోపాలి..

by Kodari Anjali |

నకిలీ విత్తన మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు

బినామీ ఫెర్టిలైజర్ షాపులపై ఉక్కుపాదం మోపాలి..
X

దిశ, పాల్వంచ రూరల్: ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బినామీ ఫెర్టిలైజర్ వ్యాపారాలను అరికట్టి, అమాయక రైతులను దోచుకుంటున్న నకిలీ విత్తన మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. పాల్వంచ మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సేవాలాల్ సేన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ తనిఖీలు కేవలం నామమాత్రంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు స్థానికుల పేర్లతో బినామీ లైసెన్సులు పొంది ఫెర్టిలైజర్ షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు. అసలు యజమానులు ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో ఉంటూ, ఇక్కడ వ్యాపారాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మందులు, ఎరువులు, విత్తనాలపై సరైన అవగాహన లేని వ్యక్తులను తక్కువ జీతాలకు నియమించి దుకాణాలు నడుపుతున్నారని విమర్శించారు.

నిబంధనలను ఉల్లంఘిస్తూ...

దీంతో రైతులకు తప్పుడు సలహాలు ఇచ్చి తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక గిరిజన రైతుల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని ఖాతాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ మండలాల వారీగా ఆకస్మిక దాడులు నిర్వహించాలని కోరారు. లైసెన్స్ కలిగిన అసలు యజమాని షాపులో ఉన్నాడా, సిబ్బందికి వ్యవసాయ ఇన్‌పుట్లపై అవగాహన ఉందా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరపుల లాలు నాయక్, నరేష్ నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story