కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. ముగ్గురి పై కేసులు నమోదు

by Batti.Sumithra |

చల్లగరిగ గ్రామంలో సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ నేతృత్వంలో పోలీసులు శనివారం ఉదయం ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. ముగ్గురి పై కేసులు నమోదు
X

దిశ, చిట్యాల : మండలంలోని చల్లగరిగ గ్రామంలో సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ నేతృత్వంలో పోలీసులు శనివారం ఉదయం ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా గుడుంబా, నిషేధిత పదార్థాలను విక్రయిస్తున్న కెతిరి సదయ్య, శ్రీపతి బిక్షపతి, బామర్ హీరాసింగ్‌ల పై కేసులు నమోదు చేశారు. గ్రామంలో 10 లీటర్ల తయారుచేసిన గుడుంబాతో పాటు, సుమారు 300 లీటర్ల గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన పానకం (బెల్లం ఊట)ను పోలీసులు గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి, ఆయా వాహనదారులకు జరిమానాలు విధించారు.

అనంతరం సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బాధితులైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. గంజాయి, గుడుంబా వంటి వ్యసనాలకు యువత, గ్రామస్తులు దూరంగా ఉండాలని, మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐ-2 రాజన్, ఎస్‌ఐ-3 ఈశ్వరయ్యతో పాటు 15 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story