నలుగురు స్మగ్లర్ల అరెస్ట్.. 30 కేజీల గంజాయి పట్టివేత

by Vemula.Srinu Prasad |

అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని నాతవరం మండలం బెన్నవరం గ్రామ శివారులో పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు..

నలుగురు స్మగ్లర్ల అరెస్ట్.. 30 కేజీల గంజాయి పట్టివేత
X

దిశ, నర్సీపట్నం: అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని నాతవరం మండలం బెన్నవరం గ్రామ శివారులో పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రామాని రాజేష్ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచే గంజాయి సేవించే అలవాటు ఉన్న రాజేష్, అనంతరం గంజాయి వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రుద్రరాజు దినేష్ వర్మతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా పటేల్ గ్రామానికి వెళ్లి గతంలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించాడు.

ఈ క్రమంలో ఈ నెల 9న రాజేష్ తన స్నేహితులు షేక్ షయాంభాషా, ముంగర సురేష్, దినేష్ వర్మలతో కలిసి మరోసారి గంజాయి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఇందుకోసం ఒక ద్విచక్ర వాహనం కొనుగోలు చేయగా, మరో కారును అద్దెకు తీసుకున్నారు. ఒడిశాలోని పటేల్ గ్రామంలో కిలో రూ.2 వేల చొప్పున మొత్తం 30 కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ నెల 12వ తేదీ రాత్రి దారకొండ, ఆర్వీనగర్, రింతాడ, గోకవరం, రాజమండ్రి, భీమవరం జాతీయ రహదారి మార్గంలో ప్రయాణిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు నాతవరం ఎస్ఐ వై. తారకేశ్వరరావు నేతృత్వంలోని పోలీసు బృందం బెన్నవరం గ్రామ శివారులో మాటు వేసి వారిని అదుపులోకి తీసుకుంది. నిందితుల వద్ద నుంచి 30 కేజీల గంజాయి, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన నాతవరం ఎస్ఐ వై. తారకేశ్వరరావు, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Next Story