అంకంపాలెం, జగ్గారం సహా మూడు బీసీ స్థానాలపై అందరి గురి

by velandi.Saikiran |

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దమ్మపేట మండలంలో రాజకీయాలను మరింత వేడెక్కించ‌నున్నాయి. మండలంలో మొత్తం

అంకంపాలెం, జగ్గారం సహా మూడు బీసీ స్థానాలపై అందరి గురి
X

దిశ, దమ్మపేట : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దమ్మపేట మండలంలో రాజకీయాలను మరింత వేడెక్కించ‌నున్నాయి. మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఎంపీపీ (మండల పరిషత్ అధ్యక్ష) స్థానం జనరల్‌కు రిజర్వ్ కావడంతో, ముఖ్యంగా అంకంపాలెం, జగ్గారం స్థానాలపై మొదలైన దృష్టి, ఇప్పుడు మరికొన్ని కీలక ఎంపీటీసీ స్థానాల వైపు మళ్లింది. బీసీ స్థానాలు

జనరల్ కేటగిరీ ఎంపీటీసీ స్థానాలైన అంకంపాలెం, జగ్గారంపై ఆసక్తి ఉన్నప్పటికీ, నాచారం, నాగుపల్లి, పట్వారిగూడెం ఎంపీటీసీ స్థానాలు బీసీ కేటగిరీకి రిజర్వ్ కావడంతో, ఎంపీపీ రేసులో ఉన్న ఆశావహులు ఈ స్థానాలను కూడా కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ మూడు బీసీ స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులకు సైతం, తరువాత ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయనే చర్చ మండలంలో నడుస్తోంది. దీంతో, పోటీ కేవలం జనరల్ స్థానాలకే పరిమితం కాకుండా, మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాల చుట్టూ తిరగనుంది.

జడ్పీటీసీపై వర్గాల పట్టు..

దమ్మపేట జడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళా రిజర్వేషన్‌గా ఖరారు కావడం, స్థానిక రాజకీయాలపై పెను ప్రభావం చూపుతోంది. మండలంలో బలమైన నేతలుగా గుర్తింపు పొందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు... ఈ జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ వర్గానికి చెందిన అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా మండలంలో పట్టు నిలుపుకోవాలని ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఎంపీపీ కోసం వ్యూహాలు

ముందుగా జడ్పీటీసీ కోసం పోటీ చేయాలనుకున్న నేతలు, ఇప్పుడు ఎంపీపీ పీఠంపై దృష్టి సారించి, అంకంపాలెం, జగ్గారం, నాచారం, నాగుపల్లి, పట్వారిగూడెం ఎంపీటీసీ సీట్లలో ఏదో ఒక స్థానాన్ని గెలిచి, తద్వారా ఎంపీపీ స్థానం కోసం ప్రయత్నించాలని యోచిస్తున్నారు. గెలిచిన అభ్యర్థి కేవలం స్థానిక నాయకుడిగానే కాక, తదుపరి ఎంపీపీ పదవి కోసం వ్యూహాన్ని ముందే సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కూడా ఈ కీలమైన ఎంపీటీసీ స్థానాలకు బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకుని, మండలంలో తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాయి. మొత్తానికి, దమ్మపేటలో ఈ ఐదు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికలతో పాటు, మండల రాజకీయ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.

Next Story