అలంకార ప్రాయంగా చెక్ పోస్ట్.. స్టాటిక్ సర్వైలెన్స్ ఎక్కడ?

by Naga Rani Yarlagadda |

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు అలంకారప్రాయంగా మారాయి.

అలంకార ప్రాయంగా చెక్ పోస్ట్.. స్టాటిక్ సర్వైలెన్స్ ఎక్కడ?
X

దిశ, బూర్గంపాడు: ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు అలంకారప్రాయంగా మారాయి. నిరంతరం డేగకన్నుతో నిఘా ఉంచాల్సిన అధికారులు, బాధ్యతను గాలికొదిలేయడంతో చెక్ పోస్టులు బోసిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాల సామాగ్రి రవాణాను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ‘స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను’ ఏర్పాటు చేసింది. అయితే మోరంపల్లిబంజర గ్రామంలోని చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది జాడ కరువైంది. వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు విధులకు డుమ్మా కొట్టడంతో వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కీలకమైన చెక్ పోస్టుల వద్దే తనిఖీలు లేకపోతే అక్రమాలను ఎలా అరికడతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు స్పందించి మోరంపల్లిబంజర చెక్‌పోస్ట్‌పై దృష్టి సారించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story