దొడ్డు' భాగ్యం.. ముక్కిన 1,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం !

by Batti.Sumithra |

పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం క్షేత్రస్థాయిలో భారీ పాలనా లోపానికి దారితీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దొడ్డు భాగ్యం.. ముక్కిన 1,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం !
X

దిశ, కొడంగల్ : పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం క్షేత్రస్థాయిలో భారీ పాలనా లోపానికి దారితీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత పాత దొడ్డు బియ్యం నిల్వలను క్లియర్ చేసే వ్యవస్థ లేకపోవడంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రేషన్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జిల్లాలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ (MLS) పాయింట్లలో లబ్ధిదారులు దొడ్డు బియ్యం తీసుకోవడానికి నిరాకరించడంతో సుమారు 1,000 మెట్రిక్ టన్నుల (దాదాపు 10,000 క్వింటాళ్లు) దొడ్డు బియ్యం గోదాములు, రేషన్ దుకాణాల్లోనే పేరుకుపోయినట్లు అధికార వర్గాల సమాచారం. వర్షాకాల తేమ కారణంగా ఈ నిల్వలు నాణ్యత కోల్పోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా ?

ప్రభుత్వం ధాన్యం సేకరణ, రవాణా, నిల్వ కోసం భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తోంది. అయితే ప్రస్తుతం గోదాముల్లో నిలిచిపోయిన ఈ భారీ నిల్వలు వినియోగం లేక పాడైపోతే ప్రభుత్వ ఖజానా పై కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సన్న బియ్యం అందుతుందనే కారణంతో లబ్ధిదారులు దొడ్డు బియ్యాన్ని తీసుకోవడం తగ్గింది.మిగిలిపోయిన నిల్వలను వెనక్కి తరలించేందుకు (Reverse Logistics) ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదు. చాలా చోట్ల బస్తాల నుంచి దుర్వాసన వస్తోందని, తేమ కారణంగా నాణ్యత దెబ్బతింటోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డీలర్లకు 'స్పేస్' సంక్షోభం..

వికారాబాద్ జిల్లా పరిధిలోని 588 రేషన్ దుకాణాల డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత దొడ్డు బియ్యం నిల్వలతో దుకాణాలు నిండిపోవడంతో ప్రభుత్వం పంపుతున్న కొత్త సన్న బియ్యం నిల్వ చేయడానికి కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. "పాత స్టాక్ కదలదు... కొత్త స్టాక్‌కు చోటు లేదు" అనే పరిస్థితి నెలకొంది. రేపు ఈ నిల్వలు నాణ్యత కోల్పోయినా, తరుగుదల వచ్చినా తమపైనే బాధ్యత మోపుతారేమోనని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"ఇది స్టేట్ ఇష్యూ"... డీఎస్‌ఓ వివరణ...

ఈ అంశం పై జిల్లా పౌరసరఫరాల అధికారిని (డీఎస్‌ఓ) వివరణ కోరగా, "ఇది రాష్ట్ర స్థాయి సమస్య. పై అధికారుల ఆదేశాల మేరకే నిల్వల క్లియరెన్స్ జరుగుతుంది. జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అని తెలిపినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ, నిర్ణయాల కోసం పై స్థాయి పై ఆధారపడాల్సి వస్తోందనే పరిస్థితిపై డీలర్లు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో క్లియర్... గ్రౌండ్‌లో భారీ నిల్వలు ?

గోదాముల్లో భారీగా నిల్వలు ఉన్నప్పటికీ, వాటి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ సమాచారంలో స్పష్టంగా కనిపించడం లేదని పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. నిల్వల పై పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి.. ప్రజలు, డీలర్లు చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవే...

గోదాముల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వల పై వెంటనే భౌతిక తనిఖీ నిర్వహించి పూర్తి వివరాలు ప్రకటించాలి. నాణ్యత దెబ్బతినకముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుని నిల్వలను తక్షణమే తరలించాలి. రేషన్ దుకాణాల్లో స్థలం కల్పించి సన్న బియ్యం పంపిణీ నిరంతరాయంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. ఈ పరిస్థితికి దారి తీసిన లాజిస్టిక్స్ లోపాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

అధికారుల వివరణ ఇదీ..

​ఈ సమస్య పై వికారాబాద్ జిల్లా DSO జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్ స్పందించారు. అధికారిక రికార్డుల ప్రకారం జిల్లాలో సుమారు 1,000 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. "ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ రాగానే ఈ నిల్వలను వెనక్కి తీసుకోవడమా లేక ఇతర అవసరాలకు మళ్లించడమా అనే దాని పై తగిన నిర్ణయం తీసుకుంటాం" అని ఆయన వివరించారు.

Next Story