నకిలీ విత్తనాల నివారణకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు: ఏడీఏ వాణిశ్రీ

by Kodari Anjali |

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల ప్రత్యేక అధికారి వాణిశ్రీ తెలిపారు.

నకిలీ విత్తనాల నివారణకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు: ఏడీఏ వాణిశ్రీ
X

దిశ, ఎర్రుపాలెం: వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల ప్రత్యేక అధికారి వాణిశ్రీ హెచ్చరించారు. సోమవారం ఎర్రుపాలెం మండలంలోని పలు విత్తన దుకాణాలను ఆమె సీడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, వ్యవసాయ అధికారి బోయినపల్లి సాయి శివ, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్‌లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిసులు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విత్తనాల విక్రయదారులు తప్పనిసరిగా అవసరమైన పత్రాలు కలిగి ఉండాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. సరైన పత్రాలు లేకుండా విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే స్టాక్ బోర్డులను తెలుగులోనే ప్రదర్శించాలని సూచించారు.

రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా..

నిషేధిత హెచ్‌టీఎ (గడ్డిమందు తట్టుకునే) పత్తి విత్తనాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో రాత్రివేళల్లో ఎవరైనా అనుమానాస్పదంగా విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని డీలర్లకు సూచించారు. మండలంలో ప్రస్తుతం 13,550 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 15,252 మిరప విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, అదనంగా వరి, మొక్కజొన్న విత్తనాలు కూడా సమృద్ధిగా నిల్వ ఉన్నాయని తెలిపారు. రైతులు విత్తనాల లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాల నివారణకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుండటం హర్షణీయమని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Next Story