- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ఆదేశానుసారమే.. భూదాన భూముల్లో పేదల ఇళ్లు
కోర్టు ఆదేశానుసారం భూదాన భూముల్లో పేదలు ఇళ్ల స్థలాలను నిర్మించుకున్నారని వారికి వెంటనే నీటి వసతి, కరెంట్ సౌకర్యం తక్షణమే కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి బి.చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు.

దిశ, ఖమ్మం టౌన్ : కోర్టు ఆదేశానుసారం భూదాన భూముల్లో పేదలు ఇళ్ల స్థలాలను నిర్మించుకున్నారని వారికి వెంటనే నీటి వసతి, కరెంట్ సౌకర్యం తక్షణమే కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి బి.చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2014లో వెలుగుమట్ల భూదాన భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించబడిందని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఇళ్లస్థలాలకు కనీస వసతులు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం వారిని అక్కడ నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరించే కార్యక్రమాలు చేయడం బాధాకరమని అన్నారు. భూదాన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నట్లు ఆరోపించారు. అట్టి భూమి నుంచి పేదలకు భయభ్రాంతులకు గురి చేసి వెళ్లగొడితే ఆ భూమిని కబ్జా చేసే అవకాశం ఉంటుందని అనుకోవడం అమాయకత్వమన్నారు. జిల్లా అధికారులు కోర్టు ఆదేశాలను అనుసరించి వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లస్థలాలు ఏర్పాటు చేసుకున్న వారికి తక్షణమే సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఒత్తిడి మేరకు పోలీసులు ఒత్తిడి చేసి పేదలను వెళ్లగొట్టాలని చూస్తే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. విజ్ఞతతో రాజ్యాంగం ప్రకారం కోర్టు అదేశాలను అనుసరించి వెలుగుమట్ల పేదలకు న్యాయం చేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. భూదాన భూములను అమ్మే హక్కు, కొనే హక్కు ఎవరికీ లేవని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు వెలుగుమట్ల భూములను ఆక్రమిస్తే న్యాయస్థానం ముందు నిలబడక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో భారత, చైనా మిత్రమండలి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మోహన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శి డి.విజయేందర్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు భద్రు నాయక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు రాంబాబు, యర్రా బాబు పాల్గొన్నారు.






