ఉలుకు.. పలుకు లేని ఉద్యమం

by Taduka Kalyani |

ఐదు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యోగ జేఏసీ చేపట్టిన ఉద్యమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.

ఉలుకు.. పలుకు లేని ఉద్యమం
X

దిశ, భద్రాచలం : పోలవరం ముంపు పేరుతో ముంపుకు గురి కాని భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేయగా.. ఆ ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన పోరాటం ఉలుకు.. పలుకు లేదు.భద్రాద్రి కేంద్రంగా రెండు నెలల క్రితం భద్రాద్రి పునరేకీకరణ పేరుతో తలపెట్టిన పోరాటం ఆరంభశురత్వం గా మారింది. ఈ సభ అనంతరం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రాజ్యసభలో ఐదు పంచాయతీల విలీనం గురించి చర్చించారు తప్ప, మరే ఇతర కార్యక్రమాలు నిర్వహించలేదు. ఉద్యోగ సంఘాలు చేపట్టిన పోరాటం మరో సకల జనుల సమ్మెను తలపిస్తుందని భావించిన ప్రజలకు నిరాసే ఎదురయ్యింది. ఆంధ్రాలో విలీనం అయిన పిచ్చుకులపాడు, కన్నాయుగూడెం, ఎటపాక,పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలు నాటినుండి నేటివరకు పాలనా పరమైన సమస్యలు కారణంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ ఐదు పంచాయతీలు ఆంధ్రలో విలీనం కావడంతో, రామయ్య భూములు సుమారు 8 వందల ఎకరాలు భూమి ఆంధ్ర లోని పురుషోత్తమపట్నం లో ఉండిపోయుంది. ఈ భూమిని అక్కడి ప్రజలు ఆక్రమించుకుంటున్నారు. దీంతో కనీసం చెత్త డంపింగ్ కు కూడా స్థలం లేక భద్రాచలం అభివృద్ధి సైతం కుంటుపడింది.పై ఐదు పంచాయతీలను ఆశాస్త్రీయంగా ఆంధ్రలో విలీనం చేశారని, తిరిగి భద్రాచలంలో విలీనం చేసేందుకు కృషి చేస్తామని పాలకపక్షంతోపాటు ప్రతిపక్షాలు హామీలు గుప్పించినా... ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఈ సమస్యను సెంట్రల్ హోమ్ మినిష్టర్ అమిత్ షా తోపాటు ఏ పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లారు. చివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేసేందుకు నడుం బిగించింది.ఈ మేరకు ఏప్రిల్ 13 న భద్రాద్రి పునరేకీకరణ విస్తృత స్థాయి అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సభకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తోపాటు బి ఆర్ ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్ రెడ్డి, భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఫారెస్ట్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య,తెలంగాణా ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

పోరాటం కొనసాగుతుంది... టి ఎన్ జి ఓస్ కార్యదర్శి బాలకృష్ణ

ఆంధ్రాలో విలీనం అయిన పోలవరం ముంపుకు గురికాని ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలం లో విలీనం చేసే వరకూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టి ఎన్ జి ఓస్ కార్యదర్శి గగ్గురి బాలకృష్ణ పేర్కొన్నారు. త్వరలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆధ్వర్యంలో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ను కలిసి ఐదు పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, స్థలం లేక నిలిచిపోయిన భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధి గురించి విన్నవిస్తామని తెలిపారు. అలాగే ఇదే సమస్య పరిష్కారం కొరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Next Story