- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగూడెంలో బెల్ట్ షాపుల రాజ్యం.. గల్లీ గల్లీకి మద్యం ప్రవాహం!
కొత్తగూడెం గల్లీ గల్లీకీ విస్తరించిన 'బెల్ట్ షాపులు' సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేవలం లైసెన్స్ పొందిన వైన్ షాపుల్లోనే మద్యం విక్రయించాల్సి ఉన్నా.. ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది.

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం గల్లీ గల్లీకీ విస్తరించిన 'బెల్ట్ షాపులు' సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేవలం లైసెన్స్ పొందిన వైన్ షాపుల్లోనే మద్యం విక్రయించాల్సి ఉన్నా.. ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అధికారులు మాత్రం 'సిండికేట్' ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గల్లీకో షాప్..
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల నుంచి మారుమూల కాలనీల వరకు బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో సుమారు 500 బెల్టు షాపులు ఉన్నట్లు తెలుస్తున్నాయి. కిరాణా కొట్టులు, పాన్ షాపులు, చివరికి టీ కొట్టుల్లోనూ మద్యం ఏరులై పారుతున్నట్లు సమాచారం. సమయంతో సంబంధం లేకుండా 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో యువత, కార్మికులు మద్యానికి బానిసలవుతున్నారు. దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, అనారోగ్యం బారిన పడుతున్నారు.
సిండికేట్ మాయాజాలం..
ఈ అక్రమ విక్రయాల వెనుక భారీ మద్యం సిండికేట్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో బెల్ట్ షాపు నుంచి నెలవారీగా భారీ మొత్తంలో వసూళ్లు జరుగుతున్నాయని, ఆ సొమ్ములో సింహభాగం ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల జేబుల్లోకి వెళ్తోందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు మొక్కుబడిగా దాడులు నిర్వహించి, చిన్నపాటి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, ఈ వ్యవస్థను మూలాల నుండి నిర్మూలించే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మద్యం కోసం తరచూ చోరీలు..
బెల్ట్ షాపులో విరివిగా మద్యం దొరుకుతుండటంతో కొంతమంది మద్యం కోసం తరచూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ధన్బాద్ పోచమ్మ గుడిలో పుణ్యం పగలగొట్టి 300 రూపాయలు, రామవరం వనందాస్ గడ్డలో ఓ కిరాణ షాపులో మద్యం బాటిల్లతో పాటు రూ.4 వేలు నగదు దొంగిలించాడు. కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని గ్రహించి, మద్యం బాటిల్ ఎత్తుకెళ్తున్నారు. బెల్ట్ షాపుల వల్ల కాలనీల్లో ప్రశాంతత కరువైందని, రాత్రి వేళల్లో తాగుబోతుల గొడవలతో భయం భయంగా గడపాల్సి వస్తోందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయించాలని కోరుతున్నారు.
'బెల్ట్' నిర్వాహకుల బెదిరింపులు
కిరాణా షాపులు, కూల్ డ్రింక్ షాపుల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారంటూ వార్తలు రాస్తే కేసులు పెడతామని 'దిశ' విలేకరికి ఓ బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఫోన్ చేసి బెదిరించాడు. తమకు అధికారులు, సిండికేట్ అండ ఉందని ఎన్ని వార్తలు రాసిన కచ్చితంగా తాము బెల్ట్ షాపులు నిర్వహిస్తామని, పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ బెదిరించాడు. దిశ వరుస కథనాలు ప్రచురించడంతోనే కొందరు సిండికేట్ వ్యాపారులు, కొందరు ఎక్సైజ్ అధికారులు వెనుక ఉండి బెల్టుషాపు నిర్వాహకులతో ఫోన్లు చేయించారని ఆయా మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.






