నగరానికే పరిమితమైన డైరెక్టర్ (పా)

by Kodari Anjali |

బాధ్యతలు చేపట్టి పన్నెండు నెలలు గడుస్తున్నప్పటికీ నెల రోజులు కూడా ఆఫీస్ లో కాలు మోపని డైరెక్టర్ (పా) వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

నగరానికే పరిమితమైన డైరెక్టర్ (పా)
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: సింగరేణి కాలరీస్ సంస్థలో సీఅండ్ఎండీ తర్వాత కీలకమైన పోస్ట్ డైరెక్టర్ పా(పీఏడబ్ల్యూ)..! పా అంటే.. పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్. బొగ్గు గని కార్మికుల బాధలు, బాగోగులు అన్ని చూడాల్సిన అధికారి ఈయన. అలాంటి అధికారి సంస్థలో బాధ్యతలు చేపట్టి పన్నెండు నెలలు గడుస్తున్నప్పటికీ నెల రోజులు కూడా ఆఫీస్ లో కాలు మోపలేదంటే ఆశ్చర్యం. వేయకమానదు ... ? కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన ఉన్నతాధికారి హైదరాబాద్ లోని సింగరేణి భవన్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తూ కొత్తగూడెం రావడానికి ముఖం చాటేస్తున్నారని కార్మికులు , ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సింగరేణి ఏరియాల వందల కిలోమీటర్ల దూరం నుండి తమ వెతలు, బాధలు చెప్పుకోవాలని భావించే బాధిత సింగరేణి కార్మికులు వారి గోడు ఎవరికి విన్నవించుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు. సింగరేణి చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా కొత్త సంప్రదాయానికి తెర తీసిన ఈ డైరెక్టర్(పా) విషయంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

సింగరేణి డైరెక్టర్ (పా) పై వెల్లువెత్తుతున్న విమర్శలు

దక్షిణభారత దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన సింగరేణి సంస్థకు డైరెక్టర్ (పా) గా విధులు నిర్వహించడం ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. సింగరేణిలో పనిచేసే ప్రతీ కార్మికుడు, ఉద్యోగికి కష్టసుఖాలు చెప్పుకునేందుకు, కార్మిక సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడం, సింగరేణి విస్తరించి ఉన్న ప్రతీ ఏరియా, కార్పోరేట్ లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరిని సమన్వయం చేస్తూ పరిపాలన చేయడం ఇలా బహువిధాలుగా విధులు . నిర్వర్తించాల్సి ఉంటుంది. డైరెక్టర్ (పా) గా నియమితులైన అధికారి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఉండి విధులు నిర్వర్తించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్మికుల కష్టసుఖాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ దాదాపు గత సంవత్సరకాలం క్రితం నియమితులైన డైరెక్టర్ (పా) తనకు కేటాయించిన చాంబర్ కు నెలరోజులు కూడా కూర్చోని విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపకపోవడంపై కార్మికులు, కార్మిక సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న తన చాంబర్ కు పరిమితమై విధులు నిర్వర్తించడం, కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల ఆయనకు కార్మిక సంక్షేమం ప్రత్యేక దృష్టి సారించకపోవడంపై కార్మిక సంఘాలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పర్యవేక్షలుగా నియమితులై దాదాపు నెలన్నర పాటు ఆ రాష్ట్రంలో విధులు నిర్వర్తించడం మినహా మిగిలిన కాలమంతా హైదరాబాద్ కు పరిమితమయ్యారని కార్మిక సంక్షేమం పట్టదా అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికుల కష్టాలు వినేవారేరి..?

సింగరేణి విస్తరించి ఉన్న ఏరియాల నుంచి దాదాపు ప్రతీరోజు పదుల సంఖ్యలో తాము బొగ్గుబాయిల మీద పడుతున్న బాధలు, తమ కష్టసుఖాలు, నష్టాలు చెప్పుకునేందుకు కార్మికులు, వారి కుటుంబసభ్యులతో పాటు ప్రధాన కార్యాలయమైన కొత్తగూడెం కార్పోరేట్ కు వస్తుంటారు. విధులు నిర్వహణలో భాగంగా కార్మికుల కష్టసుఖాలు, సాదకబాధలు విని వారి సమస్యకు పరిష్కారమార్గం చూపాలి. కానీ గత సంవత్సర కాలంగా డైరెక్టర్ (పా) ప్రధాన కార్యాలయానికి రాకపోవడంతో తాము పడుతున్న, ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికీ చెపుపకోవాలో అర్ధంకాక వారు సతమతమవుతున్నారు. సింగరేణి సంస్థలో రెండు నెలలకొకసారైనా 'గ్రీవెన్స్' డే నిర్వహించి కార్మికుల సమస్యలు, ఉద్యోగుల నుంచి ఎదురవుతున్న సమస్యలు, ఒత్తిళ్ళను చెప్పుకునేందుకు అవకాశం ఉండేది. దాదాపు సంవత్సరకాలంగా 'గ్రీవెన్స్' ను ఆటకెక్కించి కార్మికుల సమస్యలను పక్కనపెట్టారని ఫలితంగా బొగ్గుబాయిల మీద తాము అధికారుల నుంచి ఇతరుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

కొత్త సాంప్రదాయానికి తెర లేపిన డైరెక్టర్(పా)

సింగరేణిలో డైరెక్టర్(పా)గా నియమితులైన వారు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించడంతో పాటు ఏరియాల వారీగా పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకునే సంప్రదాయం ఉండేది. కానీ ప్రస్తుత అధికారి హైదరాబాద్ కు పరిమితమై చుట్టపు చూపులాగా కొత్తగూడెం కార్పోరేట్ ఏరియాకు వచ్చి వెళ్తూ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా డైరెక్టర్ (ఫైనాన్స్ ) విధులు కూడా నిర్వర్తించడం అదనపు భారంగా మారిందా.. లేక ఫైనాన్స్ పేరుతో హైదరాబాద్ లోనే శాశ్వతంగా మకాం వేశారా... ? అనే ప్రశ్నలు కార్మికులు లేవనెత్తుతున్నారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులకు డైరెకర్ (పా) అందుబాటులో లేకపోవడంతో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సింగరేణి హెడ్డాఫీస్ కేంద్రంగా అందుబాటులో ఉండాల్సిన అధికారి కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్ళను నేరుగా హైదరాబాద్ కు తెప్పించుకొని క్లియర్ చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సింగరేణిలో డైరెక్టర్లు, వివిధ హోదాలో ఉన్న అధికారులతో నేరుగా సంస్థ ఒడిదొడుకులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి కానీ అటువంటిదేమీ ప్రస్తుతం కనిపించడం లేదని, కొత్త సాంప్రదాయానికి తెరలేపారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫైరవీకారులతో ఇబ్బందని హైదరాబాద్ కే పరిమితమా...?

సింగరేణి సంస్థ లో కార్మిక సంఘాల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. సంస్థలో ఉన్న యూనియన్లు వాళ్ళ సభ్యుల సమస్యల కోసం తరచూ కార్పొరేట్, ఏరియా లలో అధికారులతో చర్చిస్తుంటారు. కొంత మేర ఫైరవీలు కూడా నడుస్తుంటాయి. కార్మికుల బదిలీలు, సంక్షేమం కోసం ప్రాధాన్యత, రిఫరెన్స్ లు ఇలా ప్రతీ దాంట్లో యూనియన్ నాయకులు ఫైరవీ లు చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే డైరెక్టర్ (పా) కు విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ గా ఉంటారనే పేరుంది. ప్రధాన కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తే తరచూ యూనియన్ నాయకులు తీసుకు వచ్చే ప్రతిపాదనలు, ఫైరవీ లకు సిఫారసు చేయడం ఇబ్బంది గా ఉంటుందనే హైదరాబాద్ కార్యాలయానికి పరిమితమయ్యారనే వాదన కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్ (పా) అందుబాటులో ఉంటేనే కార్మికులకు సంక్షేమం అందుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

డైరెక్టర్ (పా) అందుబాటులో బాగుంటుంది : కాపు కృష్ణ ( టీ బీ జీ కే ఎస్ రాష్ట్ర కార్యదర్శి)

డెరైక్టర్ (పా) కార్మికులకు అందుబాటులో ఉండాలి. పా కు విధి నిర్వహణలో నిజాయితీ అధికారిగా పేరుంది. ఆయన కొత్తగూడెం కేంద్రంగా విధులు నిర్వహిస్తే కార్మికులకు సంక్షేమ ఫలాలు త్వరగా అందుతాయి. ఈ అంశంపై ఆయన పునరాలోచించుకోవాలి.

Next Story