El Nino: భారత్‌పై ‘ఎల్ నినో’ ప్రతాపం.. మరోసారి ‘బ్రేక్ ఫేజ్’లోకి రుతుపవనాలు

by Kema Shiva Kumar |

భారత నైరుతి రుతుపవనాలపై ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా పడుతోంది.

El Nino: భారత్‌పై ‘ఎల్ నినో’ ప్రతాపం.. మరోసారి ‘బ్రేక్ ఫేజ్’లోకి రుతుపవనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలకు ‘ఎల్ నినో’ (El Nino) గండం పొంచిఉంది. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌లో స్పష్టంగా కనిపిస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని వారాల పాటు అస్థిరంగా సాగిన రుతుపవనాల సీజన్ తర్వాత, ఇప్పుడు ‘ఎల్ నినో’ తన అసలు రంగును చూపిస్తూ దేశంలో పొడి వాతావరణానికి కారణం అవుతోంది.

‘బ్రేక్ ఫేజ్’లోకి రుతుపవనాలు..

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తాత్కాలిక విరామం (Break Phase)లోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో రాబోయే 3 నుంచి న4 రోజుల పాటు దేశంలోని మధ్య, పశ్చిమ, వాయువ్య (North-Western) భారత ప్రాంతాలలో వర్షపాతం గణనీయంగా తగ్గనుంది. సాధారణంగా వర్ష మేఘాలను మోసుకొచ్చే కీలక వాతావరణ వ్యవస్థలు తాత్కాలికంగా అదృశ్యం కావడమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో విస్తారంగా వర్షాలు కురవడానికి రుతుపవనాలకు ఇంజిన్‌లా పనిచేసే మూడు ప్రధాన వాతావరణ శక్తులు బలహీనంగా మారాయి. అందులో మెడెన్-జులియన్ ఆసిలేషన్ (MJO), బోరియల్ సమ్మర్ ఇంట్రాసీజనల్ ఆసిలేషన్ (BSISO), బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన వ్యవస్థలు (LPS) ఉన్నాయి. ఈ మూడు వ్యవస్థలు పూర్తిగా బలహీనపడటంతో మేఘాల నిర్మాణం తగ్గిపోయి దేశంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఈ ఖాళీ సమయాన్ని వాడుకుంటూ ‘ఎల్ నినో’ మరింత బలోపేతం అవుతోంది. దీని ప్రభావంతో కేవలం ఈశాన్య భారతదేశంతో పాటు హిమాలయ పర్వత ప్రాంతాలలో మాత్రమే అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జూలై చివరి వారంలో ఉపశమనం..

ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ, జూలై చివరి వారంపై వాతావరణ నిపుణులు ఆశలు పెట్టుకున్నారు. జూలై చివరి 7 నుంచి 10 రోజులలో మెడెన్-జులియన్ ఆసిలేషన్ (MJO)తో పాటు బంగాళాఖాతంలో కొత్త అల్పపీడన వ్యవస్థలు మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని ఫోర్‌కాస్ట్ మోడల్స్ సూచిస్తున్నాయి. ఇవి గనుక ఊహించినట్లుగా బలపడితే, ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గి తూర్పు, మధ్య, ఉత్తర భారత రాష్ట్రాల్లో తిరిగి రుతుపవనాలు పుంజుకునేలా చేస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Next Story