తెలంగాణ జనసేనలో ఆసక్తికర పరిణామం.. కీలక నేతపై సస్పెన్షన్ వేటు

by Kema Shiva Kumar |

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై వచ్చిన వివాదాల నేపథ్యంలో జనసేన నేత బేతి మహేందర్ రెడ్డిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

తెలంగాణ జనసేనలో ఆసక్తికర పరిణామం.. కీలక నేతపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)పై నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ (Janasena Party) తెలంగాణ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన కీలక నేత బేతి మహేందర్ రెడ్డి (Bethi Mahender Reddy)ని కొంతకాలం పాటు పార్టీకి దూరంగా పెడుతున్నట్లుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఇవాళ వెల్లడించారు. అయితే, బేతి మహేందర్ రెడ్డిపై వచ్చిన తీవ్రమైన అభియోగాల నేపథ్యంలోనే ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లుగా జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో నిజానిజాలు తేలిన తర్వాతే, పార్టీ పరంగా తదుపరి తుది నిర్ణయం ఉంటుందని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.

వ్యక్తిగత విభేదాలు పార్టీకి ముడిపెడితే ఉపేక్షించం..

నాయకుల వ్యక్తిగత వివాదాలకు, వారు చేసే వ్యక్తిగత విమర్శలకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం తేల్చిచెప్పింది. మహేందర్ రెడ్డి వ్యక్తిగత వివాదాలకు, పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎవరైనా తమ వ్యక్తిగత విభేదాలను పార్టీతో ముడిపెడితే మాత్రం ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జనసేన పార్టీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మిత్రపక్షాల నేతలపై, ముఖ్యంగా కేంద్ర మంత్రిపై నిరాధార ఆరోపణలు చేయడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేననే కోణంలో ఆ పార్టీ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.

Next Story