- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. టిడబ్ల్యూజేఎఫ్ నిరసన
ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా సేవలందిస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా సేవలందిస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, రైల్వే పాసుల పునరుద్ధరణతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్సో చేస్తూ సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీడబ్ల్యూజేఎఫ్ నిజామాబాద్ ఆ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవలి కాలంలో జర్నలిస్టుల పై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నినాదాలు చేశారు. అనంతరం తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వి.భుజంగరావుకు అందజేశారు. ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఎండనకా, వాననకా ప్రజల కోసం పనిచేస్తున్నప్పటికీ వారి సంక్షేమం విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని, ఉద్యమానంతరం కూడా జర్నలిస్టుల సమస్యలు అలాగే కొనసాగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక కోడ్ ల కారణంగా జర్నలిస్టుల హక్కులు దెబ్బతిన్నాయని విమర్శించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందించాలని, అక్రిడిటేషన్ కమిటీలలో అన్ని జర్నలిస్టు సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి, వాటి కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






