22 గ్రాముల గంజాయి పట్టివేత.. అదుపులో ఇద్దరు నిందితులు

by Taduka Kalyani |

ఖమ్మం నగరంలో గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకునట్లు ఇన్స్పెక్టర్ మోహన్ బాబు తెలిపారు.

22 గ్రాముల గంజాయి పట్టివేత.. అదుపులో ఇద్దరు నిందితులు
X

దిశ ఖమ్మం క్రైం : ఖమ్మం నగరంలో గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకునట్లు ఇన్స్పెక్టర్ మోహన్ బాబు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో గురువారం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ పరిధిలో గల పుచ్చకాయల కృష్ణయ్య వెంచర్ సమీప ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారని, వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం వారిని విచారించి, తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు:1. బాసెట్టి పవన్ కుమార్, వయస్సు 26 సంవత్సరాలు, నివాసం: శ్రీనివాస్‌నగర్, ఖమ్మం.2. దేవత్ అరవింద్, వయస్సు 23 సంవత్సరాలు, నివాసం: జహీరాపుర తండా, ఖమ్మం.

నిందితుల వద్ద నుంచి పోలీసులు మొత్తం 22 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, గంజాయి రవాణాకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటీ, రిజిస్ట్రేషన్ నంబర్ TS 04 ఎఫ్ డి 3200ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు తమ వద్ద లభించిన గంజాయిని బండి ప్రవీణ్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. గంజాయి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి ప్రవీణ్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై ఎన్ డి పి ఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి సరఫరా చేయబడింది, నిందితులు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, గతంలో మరెవరికైనా గంజాయి విక్రయించారా, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలోని కాల్ డేటా, పరిచయాలు, సందేశాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ గంజాయి సరఫరా వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు వివరించారు. ఖమ్మం నగరంలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, కొనుగోలు, వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా లేదా వినియోగంలో ఎవరు పాల్గొన్నా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ కార్యకలాపాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100/112 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఖమ్మం పోలీసులు తెలిపారు.

Next Story