ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి...

by Elthuri vijay kumar |

ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి...
X

ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి...

- మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్ల విస్తరణకు మార్కింగ్

- ఖాళీ స్థలాల పరిశుభ్రత బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి‌‌

- ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం అభివృద్ధికి చర్యలు‌‌..

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

దిశ, ఖమ్మం : ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి సోమవారం సాయంత్రం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధి 12వ డివిజన్ లో పర్యటించి మునిసిపల్ నిధులు 49.80 లక్షలతో నిర్మించనున్న పెట్ పార్క్ ను, 89 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు విస్తరణ, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, మనం ప్రస్తుతం చేసే అభివృద్ధి పనులు పది కాలాల పాటు ఉండే విధంగా చేపట్టాలని అన్నారు. ఖమ్మం నగర ప్రజల ఆరోగ్యం బాగా ఉండాలంటే ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండకుండా, చెత్త వేయకుండా చూడాలని అన్నారు. నగరంలో ఖాళీ స్థలాల యజమానులు బాధ్యత తీసుకొని వారి స్థలం నుంచి దుర్వాసన, దోమలు రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని లేని పక్షంలో కార్పొరేషన్ తరపున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా కాలనీనీ క్లీన్ గా పెట్టుకోవాలని అన్నారు. రాజకీయ అవసరాల కోసం పాలన జరగవద్దని అన్నారు. పేదలకు ప్రణాళిక ప్రకారం ఇంటి స్థలాలు కేటాయించి కాలనీలు కట్టాలని అంతే తప్ప ఎక్కడంటే అక్కడ భూ ఆక్రమణలు చేయకుండా మొదటి దశలోనే నిరోధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్లపై ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, దేవుడు ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని చూడరని అన్నారు. ప్రజలు ఒప్పుకోవడంతో చెరువు బజార్, రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ చేస్తున్నామని అన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్ల విస్తరణ మార్కింగ్ చేయాలని, ప్రజలు ఒప్పుకుంటే వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు.

- ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం అభివృద్ధి చేసేందుకు చర్యలు‌‌..

రాబోయే కొద్ది రోజులలో ఖమ్మం నగరం ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు, గతంలో వేసిన బైపాస్ రోడ్డు నేడు సరిపోవడం లేదని, ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఖమ్మం నగరంలో మంచి శాంతి భద్రతలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు అందరూ సంతోషంగా, ఆహ్లాదంగా గడిపేలా ఖమ్మం నగరం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ.. మంత్రివర్యుల నాయకత్వంలో ఖమ్మం నగరం నలువైపుల అభివృద్ధి చెందుతుందని అన్నారు. 250 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 39 కోట్లతో ఖమ్మం ఖిల్లాకు రోప్ వే నిర్మాణం, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, 155 కోట్లతో మార్కెట్ యార్డ్ నిర్మాణం, విలీన గ్రామాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అంతర్గత రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులు జరుగు తున్నాయని అన్నారు. ఖమ్మం నగరంలో మట్టి రోడ్డు లేకుండా సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని, మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త బయట వేయవద్దని, రోడ్లను ఆక్రమిస్తూ ర్యాంప్ నిర్మాణం చేయవద్దని అన్నారు. మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ‌... కోటి 40 లక్షలతో 12వ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. హైదరాబాద్ నుండి ప్రేరణ తీసుకొని పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక పార్కు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నగరంలోని అన్ని డివిజన్ లలో మంత్రి వర్యుల సూచనల ప్రకారం అంతర్గత రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు, ప్రధాన రోడ్ల విస్తరణ జరుగుతున్నాయని అన్నారు. ప్రతి డివిజన్ పరిధిలో పారిశుధ్యం, గ్రీనరీ పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, దీనికి ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అందాలని మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ నాగేశ్వర రావు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story