- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేజీబీవీలో సిబ్బంది కొరత.. అదనపు బాధ్యతలపై స్పెషల్ ఆఫీసర్ల ఆవేదన
కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. రెండేళ్లుగా వీరికి మోడల్..

దిశ, తెలంగాణ బ్యూరో: కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. రెండేళ్లుగా వీరికి మోడల్ స్కూల్ బాలికల హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలు సైతం అప్పగించడంతో విపరీతమైన పని భారాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 490 మంది ఎస్ఓలు ఉండగా.. ఇందులో 248 మంది ఈ అదనపు బాధ్యతలతో పరేషాన్ అవుతున్నారు. తమకు అనేక బాధ్యతలను అప్పగిస్తున్న ప్రభుత్వం.. వేతనం మాత్రం పెంచడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సర్కారు చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే వారే లేకుండాపోయారని వాపోతున్నారు.
అప్ గ్రేడ్ తో పెరిగిన విధులు
ప్రభుత్వం కేజీబీవీలను అప్ గ్రేడ్ చేస్తున్నప్పటికీ.. అందుకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పించకపోవడంతో చదువుల నాణ్యత పడిపోయే ప్రమాదముందని ఎస్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీ ఎస్ఓలు.. సాధారణంగా తమ విద్యాలయాల్లోని విద్యార్థినుల సంక్షేమం, విద్యా సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. అయితే వీరికి మోడల్ స్కూల్ హాస్టళ్ల బాధ్యతలు అదనంగా అప్పగించారు. దీంతో ఒక్కో ఎస్ఓ సుమారు 100 నుంచి 120 మంది విద్యార్థినుల సంరక్షణను చూడాల్సి వస్తున్నది. ఈ అదనపు బాధ్యతలు తమపై మానసిక, శారీరక ఒత్తిడిని పెంచుతున్నాయని వారు వాపోతున్నారు. ప్రతీ కేజీబీవీకి ఒక స్పెషల్ ఆఫీసర్ సహా ముగ్గురిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఎస్ఓలకు చాలా ఏళ్లుగా నెలకు రూ. 32,500 వేతనం అందుతున్నది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలను అప్ గ్రేడ్ చేస్తుండడంతో విధులు మరింత పెరిగాయి.
నిర్వహణ బాధ్యత మొత్తం వారిదే..
కేజీబీవీలకు సంబంధించి స్కూల్, హాస్టల్, ఇంటర్ కాలేజీల నిర్వహణ మొత్తం స్పెషల్ ఆఫీసర్లే చూసుకోవాల్సి వస్తున్నది. కొన్ని జిల్లాల్లో మోడల్ స్కూళ్ల బాధ్యతలు సైతం వీరికే అప్పగించారు. దీంతో అన్ని విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందని ఎస్ఓలు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. మోడల్ స్కూల్ హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత, ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అనేక అంశాలను తామే పర్యవేక్షించాల్సి వస్తుందని అంటున్నారు. సరైన సిబ్బంది లేకపోవడం, అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 2017లో జాబ్ చార్ట్ ఇచ్చినా.. అందులో మార్గదర్శకాలు ఇవ్వలేదని, దీంతో అధికారులు ఇష్టానుసారంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని ఎస్ఓలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో, అదనపు బాధ్యతల నుంచి తమను తక్షణమే విముక్తి కల్పించాలని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న అదనపు భారాన్ని తగ్గించి, కేజీబీవీ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.






