ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఆ అనుమానాలకు మంత్రి పొంగులేటి క్లారిటీ

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఆ అనుమానాలకు మంత్రి పొంగులేటి క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా లోతైన సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై అక్కడికక్కడే స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.

జీ ప్లస్ వన్ పద్ధతిలో నిర్మాణాలు..

గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు, ఇప్పుడు దరఖాస్తుకున్నా అర్హత ఉంటే ఇంటిని మంజూరు చేస్తామని వెల్లడించారు. రాజకీయాలకతీతంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, ఆయా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని అన్నారు. పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. నాటి ప్రభుత్వం అక్కడక్కడా నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని, అలాగే మంచినీరు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్లను నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు.

సర్వేతోనే వివాదాలకు పరిష్కారం..

భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని.. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలోని ఐదు మండలాలలో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని తెలిపారు. సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి దాసరి అనసూయ, ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి జి.వివేక్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, హౌసింగ్ సెక్రెటిరీ వీపీ గౌతం తదితరులు పాల్గొన్నారు.

Next Story