- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు టీపీసీసీ కీలక భేటీ.. హాజరుకానున్న సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్
గాంధీభవన్‌లో నేడు టీపీసీసీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్‌లో నేడు టీపీసీసీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఇటీవల నియమితులైన నూతన డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ కార్యవర్గ నేతలతో ఈ సమావేశం జరగనున్నది. ఈ భేటీలో నూతన డీసీసీ చీఫ్‌ల నియామకం, పాత డీసీసీల అభిప్రాయ సేకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, లోకల్ బాడీ ఎన్నికలు, అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కి రెండేళ్లు పూర్తి, ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలో నిరసన ర్యాలీ వంటి కీలకాంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొంటారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం తీసుకోవాల్సిన కార్యాచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఇటీవలనే కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో డీసీసీ చీఫ్‌ల నియామకంపై వివాదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని ఆ జిల్లా మంత్రే సీఎంకు లేఖ రాయడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మరికొందరు డీసీసీల అధ్యక్షుల నియామకంపైనా వివాదాలు నడుస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించి పార్టీలో నేతలను సమన్వయం పర్చేందుకు ప్రయత్నాలుంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక పూర్వ డీసీసీలకు సమావేశంలో వీడ్కోలు కార్యక్రమం ఉంటుందని వారి నుంచి సలహాలు, సూచనలూ తీసుకునే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లా కార్యవర్గాల కూర్పుపైనా డిస్కషన్?
ఇక పార్టీలో సంస్థాగత నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నియామకం జరగటం, జిల్లా కార్యవర్గాల కూర్పుపైనా చర్చించే అవకాశాలున్నాయి. రాబోయే జెడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో నేతలు మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ నెల 7 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సదస్సు ప్రాముఖ్యత, పార్టీ తరఫున నేతలు చేపట్టాల్సిన అంశాలపై సీఎం నేతలకు దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక దేశ వ్యాప్తంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశంపైన నిరసన గళం వినిపిస్తున్నారు. సంతకాల సేకరణ కార్యక్రమం పార్టీ నేతలు చేపడుతున్నారు. ఈ సంతకాలతో ఈ నెల 14న ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిలో భాగంగా వేగంగా సంతకాల సేకరణ పూర్తి చేసే అంశంపైనా సమావేశంలో చర్చించే చాన్స్ ఉంది. జిల్లాల్లో పార్టీకి శాశ్వత భవనాల నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ కార్యాలయాలు ఆయా జిల్లాల్లో లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భవనాల నిర్మాణాలపై ఎప్పటినుంచో నేతల నుంచి డిమాండ్లు ఉన్నందున ఆ అంశాన్ని చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
వారికి అనుమతి లేనట్లే..
గాంధీ భవన్‌లో జరిగే సమావేశానికి పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు అనుమతి లేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ఆహ్వానించారు. ఆహ్వానం లేని వారిని పార్టీ సమావేశానికి అనుమతించబోమని పార్టీ నాయకులు తెలిపారు.
ఆ అంశాలపై మీనాక్షి ఫోకస్..
టీపీసీసీ డీసీసీ, పూర్వ డీసీసీలతో నిర్వహించే సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన మీనాక్షి నటరాజన్ వారం రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు. ఆమె నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పాత డీసీసీలతో సమావేశమై వారితో ముఖాముఖిలో పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. డీసీసీ చీఫ్‌ల నియామకంలో వివాదాలు నెలకొన్న జిల్లాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త డీసీసీలపైన ఏర్పడిన వివాదాలను తొలిగించే విధంగా వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి మరీ మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం పర్చడం, ఓట్ చోరీపైన సంతకాల సేకరణను పర్యవేక్షిస్తారని సమాచారం.






