- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టం: మొదటి లిఫ్ట్‌లో మోటార్ వెట్ రన్ సక్సెస్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్‌లో మోటార్ల ‘వెట్ రన్’ ఎట్టకేలకు సక్సెస్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) మరో మైలురాయి నమోదైంది. గత 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన సాంకేతిక అడ్డంకులను అధిగమించి, ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ నార్లాపూర్ (Narlapur) పరిధిలోని మొదటి పంప్ వెట్ రన్ (Wet Run) ఇవాళ విజయవంతంగా పూర్తయింది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల ఎత్తిపోతలకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల ఫస్ట్ పంప్ వెట్ రన్ నిర్వహించే క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, ఏజెన్సీ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. రాత్రింబవళ్లు శ్రమించి పంపింగ్ సిస్టమ్‌లోని సాంకేతిక లోపాలను విజయవంతంగా సరిచేసింది. లోపాలు తొలగిపోయాక మోటార్లను ఆన్ చేయగా, పంపు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా రన్ అయింది.
22 నెలల సుదీర్ఘ విరామం తర్వాత..
పాలమూరు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఫస్ట్ పంపును దాదాపు 22 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అధికారులు తిరిగి విజయవంతంగా రన్ చేయడం విశేషం. మొదటి లిఫ్ట్ పరిధిలో మొత్తం 4 పంపులను వెట్ రన్ కోసం ఇంజనీర్లు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే మొదటి పంపు ట్రయల్స్ విజయవంతం కాగా, మిగిలిన 3 పంపులను కూడా వారానికి ఒక పంపు చొప్పున వరుసగా వెట్ రన్ నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంతో నార్లాపూర్ జలాశయానికి నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు మార్గం సుగమమైంది. మిగిలిన పంపుల ట్రయల్స్ కూడా పూర్తయితే పూర్తి స్థాయిలో నీటి పంపింగ్ సాధ్యం కానుంది.






