- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేత హంగామా.. మీనాక్షి నటరాజన్ కన్నా ఎక్కువ హడావుడి
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీలో ఓ కీలక నేత షాడో ఇన్‌చార్జిలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీలో ఓ కీలక నేత షాడో ఇన్‌చార్జిలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆయన హడావుడి ఎక్కువైందని పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌లో కాలు పెట్టినప్పటి నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు సదరు లీడర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదనే చర్చ సాగుతోంది. ఏఐసీసీకి సన్నిహితంగా ఉన్నాననే కారణంతో ప్రతి రివ్యూలో ఆయన కూర్చుంటున్నారని మండిపడుతున్నారు.
ఏఐసీసీ ఆదేశాలా? సొంత నిర్ణయమా?
ఢిల్లీ నేతలతో సన్నిహితంగా ఉండే ఆ లీడర్ పీసీసీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందా? లేక ఇక్కడి పార్టీ వ్యవహారాల్లో పట్టుసాధించాలనే ఆయన తాపత్రాయ పడుతున్నారా? అనే చర్చ జరుగుతున్నది. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పర్యటనలో ఆయన హడావుడి ఎక్కువైందని విమర్శలున్నాయి. నటరాజన్.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా నటరాజన్ కన్నా ముందే సెగ్మెంట్ నేతలతో సదరు లీడర్ సమావేశమవుతున్నారు. పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆ వివరాల ఆధారంగానే మీనాక్షి నటరాజన్ రివ్యూ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ‘ముందు ఆ లీడర్ మాతో మీటింగ్ పెట్టిండు. ఆయన ఏం అడిగాడో, ఏం చెప్పాడో ఇన్‌చార్జి కూడా సరిగ్గా అవే వివరాలు అడిగారు. అవే అంశాలపై సూచనలు చేశారు’ అని ఓ రివ్యూ మీటింగ్‌కు హాజరైన నేత వివరించారు. దీంతో మీటింగ్ వచ్చిన నేతలు ఆ లీడర్‌కు షాడో ఇన్‌చార్జిగా పేరు పెట్టి ఆయన హడావుడి ఎక్కువైందని చర్చించుకుంటున్నారు.
వలస నేతలకు షాకిచ్చేలా కామెంట్స్?
షాడో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సదరు లీడర్ వల్ల పార్టీకి మంచి జరిగితే పర్లేదు. కానీ, కీడు జరిగితే అది అందరికీ నష్టమేననే ఆందోళన కేడర్‌లో మొదలైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో సదరు షాడో ఇన్‌చార్జి తీరు ఇబ్బందికరంగా మారిందని నేతలు వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి చాలా మంది కాంగ్రెస్‌లో చేరారు. అలాంటి వారి పట్ల సమీక్ష సమావేశంలో షాడో ఇన్‌చార్జి చిన్నచూపు చూసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ‘నామినేటెడ్ పదవులు కొత్తగా వచ్చిన వారికి ఇవ్వం. ఐదేండ్లుగా పార్టీలో ఉన్నొళ్లకే ఇస్తాం. లోకల్ బాడీ ఎన్నికల్లో వలస లీడర్లకు టికెట్లు ఇవ్వం. పాత నేతలకే ఇస్తాం’ అని ముఖం మీదే చెప్పేయడంతో వలస నేతలు షాక్‌కు గురైనట్టు తెలిసింది. ఇదే విషయం మీనాక్షి నటరాజన్ సైతం చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరామా? అనే వలస నేతలు ఆవేదన చెందుతున్నారు.
నటరాజన్‌ను తప్పుదారి పట్టించారా?
కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నటరాజన్ అన్ని వర్గాలతో సమావేశమై వివరాలు సేకరించారు. కానీ, సంప్రదింపుల ప్రక్రియను నాలుగు గోడల మధ్య కాకుండా.. పబ్లిక్‌గా నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. సెక్రెటేరియట్‌కు వెళ్లి మంత్రులతో సమావేశమయ్యారు. దీంతో పార్టీ ఇన్‌చార్జి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. అలాగే, హెచ్‌సీయూ విద్యార్థులతో సమావేశమయ్యేందుకు వర్సిటీకి వెళ్లడం సరికాదని, ఏదైన హోటల్ లేదా గెస్ట్ హౌజ్‌కు పిలిచి మాట్లాడితే బాగుండేదని కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంలో నటరాజన్‌ను సదరు షాడో ఇన్‌చార్జి తప్పుదారి పట్టించారనే అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని, పార్టీ విషయాలను మాత్రమే పర్యవేక్షిస్తానని బాధ్యతలు తీసుకున్న కొత్తలోనే మీనాక్షి స్పష్టం చేసినట్టు నేతల్లో చర్చ జరుగుతున్నది.
పట్టుకోసం లాబీయింగ్
చట్టసభ ఎన్నికల్లో పోటీ చేసిన సదరు లీడర్ (షాడో ఇన్‌చార్జి) ఓటమిపాలయ్యారు. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ఏఐసీసీ లీడర్ల వద్ద తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పెద్ద సమస్య కాదని, కానీ పార్టీ వ్యవహరాల బాధ్యతలను సైతం తనకే అప్పగించాలని ఆయన పట్టుపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆ బాధ్యతలు అప్పగిస్తే ఆయన చెప్పినట్టుగానే పార్టీ కార్యక్రమాలు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ కీలక నేతలకు ఇష్టం లేదని పార్టీ వర్గాల్లో టాక్. దీంతో సదరు లీడర్ తనకు ఢిల్లీ నేతలతో ఉన్న పరిచయాలతో పీసీసీలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతల ముందు ‘నేను మామూలు లీడర్‌ను కాదు. ఢిల్లీ స్థాయిలో నాకు పలుకుబడి ఉంది’ అని గొప్పలు చేప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటారనే విమర్శలున్నాయి.






