CPIM తెలంగాణ కీలక నిర్ణయం.. స్వచ్ఛందంగా తప్పుకున్న ముఖ్య నేతలు

by Gantepaka Srikanth |

సీపీఐఎం తెలంగాణ(CPIM Telangana) రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి వేదికగా జరిగాయి. జనవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అత్యంత అట్టహాసంగా జరిగాయి.

CPIM తెలంగాణ కీలక నిర్ణయం.. స్వచ్ఛందంగా తప్పుకున్న ముఖ్య నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐఎం తెలంగాణ(CPIM Telangana) రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి వేదికగా జరిగాయి. జనవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అత్యంత అట్టహాసంగా జరిగాయి. ముగింపు సందర్భంగా ఇవాళ ఆ పార్టీ నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఖమ్మం నేత, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) స్థానంలో రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌ వెస్లీ(John Wesley) నియమితులయ్యారు. వనపర్తి జిల్లా అమరచింత ఆయన స్వస్థలం. గతంలో డీవైఎఫ్‌ఐ(DYFI), కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని వీరభద్రమే కార్యదర్శిగా పనిచేశారు. దీంతో ఈసారి బడుగు బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో జాన్ వెస్లీని ఎన్నుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా జి.నాగయ్య, ఎస్.వీరయ్య, పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీ.జ్యోతి, చుక్క రాములు, పాలడుగు భాస్కర్, టీ.సాగర్, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, పి.ప్రభాకర్, నున్న నాగేశ్వరరావు, బండారు రవికుమార్, ఎండీ జహంగీర్‌లను మహాసభ ఎన్నుకుంది. ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు దాటిన నేతలకు సీపీఎం రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన కల్పించింది. దీంతో వయసు రీత్యా రాష్ట్ర కమిటీ నుంచి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, నర్సింగ్ రావులు స్వచ్ఛదంగా తప్పుకున్నట్లు సమాచారం. మహాసభల అనంతరం ఆ పార్టీ కీలక నేతలు మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకురావాలని చూస్తోందని.. దీని వల్ల చాలా ప్రమాదం ఉందని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నికను దేశంలోని అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గిపోతుందనేది బూటకమని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఎన్నికల కోడ్‌కు ముడిపెట్టడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసే హక్కు ప్రజలకే ఉంటుంది తప్ప.. ప్రధాని మోడీకి లేదంటూ ధ్వజమెత్తారు. ఒకే దేశం ఒకే ఎన్నిక తర్వాత అధ్యక్ష తరహా పాలన వస్తుందన్నారు.

Next Story