EC: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక నిర్ణయం

by Prasad Jukanti |

ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

EC: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక నిర్ణయం
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంపొందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ గురువారం కీలక ప్రకటన చేసింది. ఇకపై పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఈవీఎంల చివరి రెండవ రౌండ్ ను లెక్కించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కౌంటింగ్ రోజున ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుండగా ఈవీఎం లెక్కింపు 8:30 గంటలకు ప్రారంభమవుతున్నది. అయితే ఇటీవల వికలాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద ఓటు వేయడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ క్రమంలో కొన్ని స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకంటే ముందే ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జాప్యంతో పాటు, అనవసరపు గందరగోళాన్ని నివారించేందుకు వీలుగా ఇకపై ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్న క్రమంలో చివరి రెండో రౌండ్ కౌంటింగ్ కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేకే ఈవీఎంల మిగిలిన రెండు రౌంట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మేరకు తగినన్ని టేబుళ్లు, సిబ్బంది ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఈసీ ఆదేశించింది. కాగా ఎన్నికల ప్రక్రియను మరింతగా మెరుగుపరిచేందుకు ఎన్నికల సంఘం గత ఆరునెలల్లో ఇప్పటి వరకు వివిధ అంశాలపై 29 నిర్ణయాలు తీసుకోగా ఇది 30వ నిర్ణయం.

Next Story