Medaram Jatara: మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదు: కిషన్ రెడ్డి

by Prasad Jukanti |

మేడారం జాతర విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు.

Medaram Jatara: మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదు:  కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదన్నారు. ఇవాళ వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా పరిశీలించారు. ఇందుకోసం ఆయన వందేభారత్ రైలులో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్నారు. రేల్వే స్టేషన్ క్యాంటీన్‍లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడారం జాతరపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మేడారం జాతర (Medaram Jatara) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ఉందని చెప్పారు. రామప్ప, వేయిస్థంబాల గుడికి పూర్వవైభవం వచ్చిందన్నారు. భక్తుల అవసరాలకు తగట్టు వసతులు సమకూరుస్తామని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం లేఖ రాస్తే స్పందన లేదన్నారు.

జాతీయ హోదా కోసం ప్రభుత్వం డిమాండ్:

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి, గిరిజన జాతర అయిన మేడారం మహాజాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు వేదికలపై ప్రస్తావించారు. కుంభమేళాకు కేటాయిస్తున్నట్లుగానే రూ.వేల కోట్ల నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి పనులు చేపట్టింది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ తో మేడారం జాతర రూపురేఖలే మారబోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

Next Story