క్యూర్ చట్టంలో కీలక మార్పు.. ప్రాపర్టీ ట్యాక్స్‌పై ఫోకస్

by Malleboina Mahesh |

ఆస్తి పన్ను లెక్కింపులో క్యూర్ (CURE) చట్టం ద్వారా కీలక మార్పు.. ఇకపై రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా పన్ను.. అమ్ముడుపోని ఫ్లాట్లకు బిల్డర్లే ట్యాక్స్ కట్టాలి!

క్యూర్ చట్టంలో కీలక మార్పు.. ప్రాపర్టీ ట్యాక్స్‌పై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే కోర్ అర్బన్ రీజియన్ బిల్-2026 లో ఈ అంశాన్ని పొందుపర్చింది. అయితే పాత జీహెచ్ఎంసీ ఏరియాలో మాత్రమే యాన్యువల్ రెంటల్ వ్యాల్యూ ఆధారంగా ప్రాపర్టీ వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల్లో సైతం క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే వసూలు చేస్తున్నారు. దీంతో ఒకే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు రకాల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఫలితంగా జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచకుండానే ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తే మూడు కార్పొరేషన్లలో సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.

క్యాపిటల్ వ్యాల్యూ ఇలా..

ప్రతి భూమి, భవనం ‘క్యాపిటల్ వ్యాల్యూ’ (మూలధన విలువ) ఆధారంగా ఆస్తి పన్నును లెక్కించనున్నారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించే గైడ్‌లైన్ వాల్యూ (నమోదు విలువ)నే ఈ క్యాపిటల్ వ్యాల్యూ గా పరిగణిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం, పన్ను వసూళ్లను సులభతరం చేయడం కోసం ప్రభుత్వం ఈ విధానంలో అవసరమైన మార్పులు చేసింది. క్యాపిటల్ వ్యాల్యూ ప్రకారం రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కు క్యాపిటల్ వ్యాల్యూలో కనీసం 0.10 శాతం నుంచి గరిష్ఠంగా 0.50 శాతం వరకు వసూలు చేయనున్నారు. కమర్షియల్ బిల్డింగ్స్, ఇతర భవనాలకు క్యాపిటల్ వ్యాల్యూలో కనీసం 0.20 శాతం నుంచి గరిష్ఠంగా 2 శాతం వరకు వసూలు చేయనున్నారు.

ఒకవేళ కార్పొరేషన్ ఇంకా కొత్త పన్ను రేట్లను అధికారికంగా ఖరారు చేయకపోతే, తాత్కాలికంగా నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య/ఇతర భవనాలకు 0.75 శాతం వసూలు చేయనున్నారు. భవనాల వినియోగం, సదరు ప్రాంతానికి ఉన్న ఆదాయ ఉత్పాదక సామర్థ్యం, ఇతర కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, వేర్వేరు ప్రాంతాలకు లేదా విభిన్న రకాల భవనాలకు వేర్వేరు పన్ను రేట్లను నిర్ణయించే అధికారం కార్పొరేషన్‌కు ఉంటుంది. ఒకే భవనాన్ని ఇటు నివాసానికి, అటు వ్యాపారానికి (మిశ్రమ వినియోగం) వాడుతుంటే.. ఆయా భాగాలను వేర్వేరుగా అంచనా వేస్తారు. మొత్తం స్థలం విలువను భవన విస్తీర్ణం నిష్పత్తి ప్రకారం విభజించి, ఏ భాగానికి వర్తించే పన్నును ఆ భాగానికి విడివిడిగా లెక్కిస్తారు.

క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ

కార్పొరేషన్ నిర్ణయాన్ని బట్టి ఆస్తి పన్నును ముందస్తుగా హాఫ్-ఇయర్లీ, క్వార్టర్లీ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. హాఫ్-ఇయర్లీ అయితే ప్రతి ఏటా ఏప్రిల్ 1, అక్టోబర్ 1 తేదీల్లో చెల్లించాలి. క్వార్టర్లీ అయితే ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1 తేదీల్లో పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆస్తి యజమానులు, అనుభవదారులు నిర్ణీత ఫార్మాట్‌లో కమిషనర్‌కు రిటర్న్స్ దాఖలు చేయాలి. పన్ను చెల్లించిన ప్రతి ఒక్కరికీ కార్పొరేషన్ తప్పనిసరిగా రసీదు ఇవ్వనుంది. కొత్తగా నిర్మించిన భవనాలకు లేదా ప్రాపర్టీలకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ చేసిన తేదీ నుండి 6 నెలలు పూర్తయిన రోజు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు లేదా ఇతర సర్వీస్ బిల్లులు వచ్చిన తేదీ, కమిషనర్ లేదా సంబంధిత అధికారి స్వయంగా వచ్చి భవనాన్ని పరిశీలించి, వినియోగంలో ఉన్నట్లు నిర్ధారించిన తేదీ ఈ మూడింటిలో ఏది ముందైతే దాని ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయనున్నారు.

అమ్ముడుపోని ఫ్లాట్లపై

ఒక విల్లా లేదా అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత... విక్రయించిన యూనిట్లకు కొనుగోలుదారులు పన్ను చెల్లించాలి. ఒకవేళ బిల్డర్/ప్రొప్రైటర్ వద్ద ఇంకా అమ్ముడుపోని యూనిట్లు ఉంటే, వాటికి సంబంధించిన పన్నును బిల్డరే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్‌ను కొనుగోలుదారులపై భారం వేస్తున్నారు. బిల్డర్ అమ్ముకునిపోతే కొన్నవారే భరిస్తున్నారు. దీని చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story