Medaram: మేడారంలో ప్రారంభమైన కేబినెట్ కీలక భేటీ..

by Ramesh Naini |   (  Updated:2026-01-18 14:19:21  IST  )

తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది.

Medaram: మేడారంలో ప్రారంభమైన కేబినెట్ కీలక భేటీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలోని హరిత హోటల్‌లో ఈ కీలక భేటీ జరుగుతోంది. ఖమ్మంలో జరిగిన సీపీఐ బహిరంగ సభ ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మేడారం చేరుకున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి, తొలుత అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రులతో కలిసి నడుచుకుంటూ హరిత హోటల్‌కు చేరుకున్నారు.

నిఘా నీడలో మేడారం:

మేడారం మహాజాతర భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన సీఎం, అక్కడ సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. జాతరలో భద్రత కోసం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ గురించి ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా చర్యల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను సీఎం ఆదేశించారు.

అజెండాలో కీలక అంశాలు ఇవే..

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన, మున్సిపల్ ఎన్నికలు, యాసంగి రైతు భరోసా వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. రాజధాని వెలుపల కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో పోలీసులు మేడారం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భేటీ అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

READ MORE .....

సీఎంతో పాటు మేడారంకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి-మంత్రులు!

Next Story