రెండేళ్లలో 61379 ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం కీలక ప్రకటన

by Prasad Jukanti |

లక్ష ఉద్యోగాల మైలురాయి దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయాణం సాగుతోందని ప్రభుత్వం తెలిపింది.

రెండేళ్లలో 61379 ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ (Telangana government jobs) చేసిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏళ్లకేళ్లుగా నియామకాలకు నోచుకోక తల్లడిల్లిన తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొలువుల పండుగను నిర్వహించి నిరుద్యోగులకు తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందించి సరికొత్త ఒరవడి నెలకొల్పారని తెలిపింది. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ఈ రెండేండ్లలో కొత్త రికార్డు నమోదు చేసిందని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టిందని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఓ ప్రకటన విడుదల చేసింది. 61379 ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసిందని మరో 8632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయని స్పష్టం చేసింది. వీటితో కలిపితే మొత్తం ఉద్యోగ నియామకాల సంఖ్య 70,011 చేరిందని త్వరలోనే లక్ష ఉద్యోగాల మైలురాయిని అందుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపింది.

ఉద్యోగాల భర్తీలోనూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కీలక రంగాలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని రాష్ట్రంలో పాలనా విభాగంలో అత్యున్నతమైన సర్వీసులతో పాటు విద్యా రంగానికి. వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్టు తెలిపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారని స్పష్టం చేసింది. అప్పటి వరకు పెండింగ్‍లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలిగించే చర్యలు వేగవంతం చేశారని పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా టీజీపీఎస్సీ నియామకాల వయో పరిమితిని ప్రజా ప్రభుత్వం సడలించిందని గుర్తు చేసింది.

గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో.. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో.. నియామక పత్రాలు ఎపుడిస్తారో అనే స్పష్టత ఉండేది కాదని కానీ ఈ ప్రభుత్వం తొలి రెండేండ్లలోనే కీలకమైన పరీక్షలను విజయవంతంగా నిర్వహించి చెప్పిన సమయానికి పోస్టింగ్‍లు కూడా ఇచ్చేసిందని తెలిపింది. ఈ రెండేండ్లలో 13 సార్లు కొలువుల పండగ వేడుకలు నిర్వహించిందని, రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించిన యువతను ఆహ్వానించి ఎల్ బీ స్టేడియం, శిల్ప కళా వేదికలో భారీ వేడుకగా కొలువుల పండగ జరిపారు. స్వయంగా సీఎం హాజరై నియామక పత్రాలు అందించి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటిచెప్పారని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు, వారి తల్లిదండ్రులతో కలిసి నియామక పత్రాలను అందుకోవటం నవతరానికి కొత్త స్పూర్తిని అందించిందని తెలిపింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చిందని తెలిపింది. సివిల్ సర్వీసెస్ తరహాలో తెలంగాణలో అత్యున్నతమైన సర్వీసు ఉద్యోగాలకు నిర్వహించే తొలి గ్రూప్ 1 రిక్రూట్​మెంట్‍ను ప్రజా ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని గతంలో పేపర్ లీకేజీతో ఆందోళనకు గురైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించిందని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా గందరగోళమైన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి 562 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా ఈ పరీక్షల్లో విజేతలుగా నిలిచి.. గ్రూప్ 1 సర్వీస్ కు ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం నియామక పత్రాలు అందజేశారని వెల్లడించింది.

టీజీపీఎస్సీ అధ్వర్యంలో గ్రూప్ 2 పరీక్షలను కూడా ప్రభుత్వం ప్రశాంతంగా నిర్వహించిదని 2024 డిసెంబర్ 15 ,16 తేదీల్లో జరిగాయని తెలిపింది. పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలు 2025 సెప్టెంబర్ 28న విడుదల చేసి.. ఉద్యోగాలకు ఎంపికైన 782 మంది అభ్యర్థులకు అక్టోబరు 18న ప్రభుత్వం నియామక పత్రాలు అందించినట్టు పేర్కొంది. టీజీపీఎస్సీ గ్రూప్ 3 సర్వీస్ పోస్టుల కోసం మూడేండ్ల కిందట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రజా ప్రభుత్వం హయంలో గాడిలో పడింది. 1365 పోస్టులతో 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదలైతే.. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే వీరికి పోస్టింగులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపింది.

గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం వేదికపై మొత్తం 8143 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా ఈ రెండేండ్లలోనే 15,780 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నియామకాలకు అదనంగా ఇతర విభాగాల్లో 6293 పోస్టులను భర్తీ చేసిందని వెల్లడించింది. గత పదేండ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి 11,062 పోస్టులు భర్తీ చేసిందని తెలిపింది. గతేడాది జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30న ఫలితాలను వెల్లడింస్తే వీరిలో 10,006 మంది ఉద్యోగాల్లో చేరారారని తెలిపింది. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం 8,400 మందికి నియామక పత్రాలను అందించిందని కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ తరగతులకు క తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపట్టిందని తెలిపింది.

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటీనీ ప్రభుత్వం అధిగమించింది. ఎంపికైన 16,067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 8666 మంది ఉద్యోగ నియామకాలు విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపింది. వీటిలో 6956 స్టాఫ్ నర్స్ లతో పాటు 1260 ల్యాబ్ టెక్నిషియన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 422, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్‌, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులున్నాయి. వీటితో పాటు మరో 7267 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ నియామకాలు పూర్తయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

రెండేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు

■ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ : 15,780

■ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు : 16,067

■ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు : 8,666

■ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు : 8,400

■ డీఎస్సీ- పాఠశాల విద్య: 10,006

■ టీజీ జెన్ కో , టీజీ ఎన్ పీడీసీఎల్ - 1105

■ సింగరేణి, ఇతర సంస్థలు: 1355

__

మొత్తం : 61,379

____

■ మెడికల్ అండ్ హెల్త్ లో నియామక ప్రక్రియలో ఉన్నవి: 7267

■ గ్రూప్ 3 పోస్టులు (సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతోంది): 1365

Next Story