kCR: కాళేశ్వరంపై విచారణకు గడువు కోరడం వెనుక కేసీఆర్ భారీ వ్యూహం?

by Prasad Jukanti |

కాళేశ్వరంపై గడువు కోరడం వెనుక కేసీఆర్ భారీ వ్యూహం?

kCR: కాళేశ్వరంపై విచారణకు గడువు కోరడం వెనుక కేసీఆర్ భారీ వ్యూహం?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh) ఎదుట కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని, ఆ రోజుకు బదులుగా జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా కేసీఆర్ కమిషన్‌కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ అందుకు అంగీకరించింది. అయితే ఈ నెల 6న మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉండగా యథావిధిగా విచారణను ఎదుర్కొంటారా? లేక వీరు కూడా గడువు కోరుతారా? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వీరిద్దరూ హాజరైతే చివరగా కేసీఆర్ కమిషన్ ముందుకు రానున్నారు.

ఆ ఇద్దరి తర్వాత వెళ్లాలనా?!..

విచారణకు మరింత సమయం కావాలని కేసీఆర్ కోరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. నోటీసులు అందిన తర్వాత కేసీఆర్‌తో హరీశ్‌రావు వరుసగా భేటీలు కావడంపాటు విచారణకు హాజరవుతామనే మెసేజ్ ఇచ్చారు. కాళేశ్వరానికి (Kaleshwaram) సంబంధించి అన్ని వివరాలు పీసీ ఘోష్ ఎదుట ఉంచుతారని, ఇదే సమయంలో తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించేలా కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను చాటిటెప్పేలా హరీశ్‌రావు చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇప్పించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇంతలో చివరి నిమిషంలో కేసీఆర్ తన మనసు మార్చుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందనే వాదన ఒకటి తెరపైకి వస్తోంది. తొలుత ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం ముందు కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సి ఉంటే ఆ తర్వాత ఈటల, హరీశ్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. తొలుత తాను వెళ్లడం కంటే ముందు హరీశ్‌రావును విచారణకు పంపడం ద్వారా కమిషన్ విచారణ శైలి, ఏయే అంశాలపై దృష్టి పెట్టిందనేది ముందుగానే ఓ అంచనాకు రావచ్చనే వ్యూహంలో భాగంగానే గడువు కోరారా? అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో లేఖ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నట్లు పీసీ ఘోష్ కమిషన్ విచారణను సైతం లేఖతోనే సరిపెట్టే ప్రయత్నమేమైనా చేస్తారా? అనేది వేచిచూడాలి.

హరీశ్‌రావు పీపీటీ వాయిదా...

కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్‌పై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం విశిష్టత, ప్రాముఖ్యత వివరించేందుకు హరీశ్‌రావు (Harish Rao) పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఈ పీపీటీ జరగాల్సి ఉండగా హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు వచ్చినప్పటికీ పీపీటీ మాత్రం నిర్వహించలేదు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి? ఇందులో ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటో ప్రజలకు విరిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా కేసీఆర్ విచారణకు గడువు కోరడం, హరీశ్‌రావు పీపీటీని వాయిదా వేయడం చర్చగా మారింది. కేసీఆర్ విచారణకు గడువు కోరినంత మాత్రాన ప్రజల్లోకి తమ వాయిస్ తీసుకువెళ్లే అవకాశం ఉండే పీపీటీని ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందనేది సొంత పార్టీలో చర్చనీయాశంగా మారింది.

Next Story