అల్లుడు హరీశ్‌కు దన్నుగా కేసీఆర్..! కూతురును కాదనుకుని సంచలన నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-03 01:53:11  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కన్న కూతురు కంటే అల్లుడి వైపే నిలిచారు.

అల్లుడు హరీశ్‌కు దన్నుగా కేసీఆర్..! కూతురును కాదనుకుని సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కన్న కూతురు కంటే అల్లుడి వైపే నిలిచారు. కుమార్తెను పార్టీ సస్పెండ్ చేస్తూ సంచలనం తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కవిత వర్సెస్ హరీశ్‌రావు ఎపిసోడ్‌లో గులాబీ దళం కూడా చివరికి మాజీమంత్రి వైపే నిలిచింది. సోమవారం ప్రెస్‌మీట్‌లో కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ స్పందించింది. హరీశ్‌రావుకు మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా.. ఆ వెంటనే ఆ మెస్సేజ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ హరీశ్‌రావుకు మద్దతుగా నిలిచారు. డైనమిక్ లీడర్ అంటూ కొటేషన్ పెట్టారు.

స్వాగతించిన కేడర్

కూతురు అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అలాగే కూతురికి ఆ తండ్రి అంటే ప్రేమ ఉంటుంది. కానీ.. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం యావత్ రాష్ట్రాన్ని విస్మయపరిచింది. సొంత బిడ్డ పట్ల కఠిన నిర్ణయం తీసుకోవడం పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. కూతురు కవిత ఉద్యమ కాలం నుంచి తన తండ్రి కేసీఆర్ వెంటే ఉన్నప్పటికీ అధినేత పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడాన్ని పార్టీ కేడర్ స్వాగతించింది.

వ్యక్తిగత విమర్శలు వద్దు

చర్యల నేపథ్యంలో వ్యక్తిగతంగా కవిత మీద మాట్లాడొద్దని పార్టీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు ఎవరు కూడా కవితపై వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం ఆమె వల్ల పార్టీకి జరిగిన నష్టంపైనే మాట్లాడాలని అధినేత కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అందుకే.. రాష్ట్రవ్యాప్తంగా కేడర్ స్పందించినప్పటికీ ఎక్కడా ఎవరూ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు. పార్టీకి డ్యామేజీ జరిగేలా కామెంట్స్ చేయడాన్ని మాత్రమే తప్పుబట్టారు.

లిక్కర్ స్కాంలో వాదించి..!

కవితపై సస్పెన్షన్ వేటు ప్రకటన అందరినీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణలో కవిత తరఫున అడ్వొకేట్ సోమ భరత్ వాదనలు వినిపించారు. ఆయనే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడి హోదాలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Read More :రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీ..! సన్నిహితులతో కవిత సమాలోచనలు

Next Story