KCR పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగం: మంత్రి సత్యవతి

by Satheesh |

ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్స్‌కు ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

KCR పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగం: మంత్రి సత్యవతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్స్‌కు ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆర్థికంగా నిలదొక్కు కోవాలనుకునే గిరిజన ఉన్నత విద్యావంతులకు సీఎం గిరిజన ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్టీఈఐ) దోహదపడుతుందన్నారు. సీఎంఎస్టీఈఐ పథకం లబ్ధిదారులకు మున్సిపల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇస్తామన్నారు.

హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో సోమవారం 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్ని కులమతాల మధ్య గీతలను కరోనా చెరిపివేసిందని, ఆర్థికంగా అభివృద్ధి చెందితే కులవ్యత్యాసాలు రూపుమాసిపోతాయన్నారు. సమాజాన్ని ఎన్ని ముక్కలుగా విభజించినా అందరం ఒక్కటే అనే మాట అర్ధమైందన్నారు. దేశం నుంచి కూడా పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యవస్థాపకులు రావాలని ఆకాంక్షించారు.

ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ అనేవి దేశాభివృద్ధికి మూడు సూత్రాలన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారని, కానీ దేశం నుంచి వచ్చిన ఇన్నోవేషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం పంచాయతీ అవార్డులను గెలుచుకున్నదని చెప్పారు.

కొత్త పారిశ్రామిక వేత్తలను మరింతమంది యువతను ప్రోత్సహించాలని సూచించారు. ఎస్టీ యువ వ్యాపారవేత్తలను మున్సిపల్‌ శాఖ ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. దేశంలో ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అందించే అన్ని సదుపాయాలను వినియోగించుకోవాలని, ఎదురుదెబ్బ తగిలినా విడిచిపెట్టొద్దు.. దైర్యంగా ముందుకు సాగాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పిలుపు నిచ్చారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎంఎస్టీఈఐ పథకం ద్వారా ఇప్పటి వరకు 50లక్షల మందికి పైగా గిరిజనులకు ఆర్థికసాయం అందజేశామన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగం అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రాజెక్టు స్వరూపాన్ని బట్టి కోటి వరకు ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందన్నారు. ప్రభుత్వమే పూచీకత్తుగా బ్యాంకు లింకేజీని ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం యూనిట్ కాస్టులో 35శాతం రాయితీ కూడా ఇస్తుందన్నారు. గిరిజన యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ భరోసాతో గిరిజన యువత అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నడిబొడ్డున గిరిజనులకు సేవాలాల్‌, కొమురంభీం భవనాలును ప్రభుత్వం నిర్మించిందని వెల్లడించారు. ఎస్టీ రిజర్వేషన్లను సీఎం కేసీఆర్‌ 10 శాతానికి పెంచారని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటిచందర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్రనాయక్, తదితరులు పాల్గొన్నారు.

Next Story