బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను డైవర్ట్ చేసేందుకు సీఎం KCR మాస్టర్ ప్లాన్..!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను డైవర్ట్ చేసేందుకు సీఎం KCR మాస్టర్ ప్లాన్..!
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ డ్యామేజ్ మేనేజ్ మెంట్​పాలి‘ట్రిక్స్’ ప్రదర్శిస్తున్నది. వీలైనంత వరకు ఈ కేసును జాతీయస్థాయిలో చర్చల్లో ఉండేటట్లు చేసి కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టటమే టార్గెట్‌గా పావులు కదుపుతున్నది. మరోవైపు సెంటిమెంట్ పేరిట రాష్ట్ర ప్రజల నుంచి సానుభూతిని కూడగట్టుకునే ప్రయత్నాలూ చేస్తు్న్నది.

బీజేపీ అగ్ర నేతలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నది. మరో అడుగు ముందుకేసి కమలం నేతల వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నది. ఇందులో భాగంగా నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు జరిపిస్తున్నది. వీటిపై కేసీఆర్ పెద్దగా స్పందించకపోతున్నా.. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పార్టీ నేతలు కావాలనే కేంద్రం టార్గెట్ చేస్తున్నదని పదే పదే విమర్శల దాడులు చేస్తున్నారు. కేంద్రం టార్గెట్ కవిత కాదని, సీఎం కేసీఆర్ అని చెప్పుకుంటున్నారు. కేంద్రప్రభుత్వ విధానాలను కేసీఆర్ ఎండగడుతున్నందుకే ఇదంతా అని చేస్తున్నదని అంటున్నారు.

బండి కామెంట్స్‌ను చాన్స్‌గా తీసుకుని..

లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నది తెలిసిందే. ఈ స్కామ్‌లో ఉన్న సౌత్ గ్రూపులో ఆమెదే కీలక పాత్ర అని ఇప్పటికే ఈడీ తేల్చిచెప్పింది. ఇప్పటికే అరెస్టైన బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ తదితరుల విచారణలోనూ కవిత పేరును చెప్పినట్టు రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన పలు డాక్యుమెంట్లలోనూ పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో కవితకు ప్రతినిధిగా ఉన్నట్టు పిళ్లయ్ స్వయంగా ఒప్పుకున్నట్టు స్పష్టం చేసింది. దీంతో కవితపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీతో పాటు అన్నిపక్షాల అగ్రనేతలు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇలాంటి పరిణామాలు బీఆర్ఎస్‌ని ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్రమత్తమైన గులాబీ బాస్ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. అయితే.. ‘స్కామ్ చేస్తే.. అరెస్టు చెయ్యకుండా.. ముద్దు పెట్టుకుంటారా..’’ అన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్‌ను చాన్స్‌గా బీఆర్ఎస్ నేతలు తీసుకున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని గల్లీ దాకా నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా యాభైకి పైగా పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్‌పై ఫిర్యాదులు చేశారు.

ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా.. కానీ..

లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ ఖాయమనే వార్తలు వస్తుండగా బీఆర్ఎస్ నేతలు డ్యామేజ్ పాలిటిక్స్‌లో భాగంగా ఓ వైపు కేంద్రంపై దాడి చేస్తున్నది. మరోవైపు కావాలనే బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నదంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు అరడజను మంది బీఆర్ఎస్ నేతలపై ఐటీదాడులు ఇందులో భాగమేనని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ కవితను కూడా వేధిస్తున్నారనే ఆరోపణలకూ తెరలేపారు. దేశంలో వచ్చేది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తుతుండటాన్ని బీజేపీ తట్టుకోలేక పోతున్నదని విమర్శలు చేస్తున్నారు. దీన్ని నిత్యం జాతీయస్థాయిలో చర్చల్లో ఉండేలా చూస్తున్నారు.

ఇందులోభాగంగానే.. గురువారం ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవటాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. సుప్రీంకోర్టులో తను దాఖలు చేసిన పిటీషన్​విచారణలో ఉందని, దానిపై ఉత్తర్వులు వెలువడిన తర్వాతే వస్తానని ఆమె ఈడీకి మెయిల్ పంపించారు. ఒక మహిళగా తనకు చట్టపరంగా కొన్ని హక్కులు ఉన్నాయని పేర్కొంటూ.. వాటిని కాపాడుకుంటానని అందులో స్పష్టంచేశారు. అయితే, బీఆర్ఎస్ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఇప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే కవిత అరెస్ట్ ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పై కచ్చితంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

Also Read..

అప్పటి వరకు విచారణకు హాజరు కాలేను: ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్

Next Story