ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వండి.. అందరూ గ్రోక్ వాడండి: BRS నేతలకు KCR ఆదేశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-03 16:04:00  IST  )

పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ గ్రోక్‌ను వాడాలని.. టెక్నాలజీని వినియోగించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు.

ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వండి.. అందరూ గ్రోక్ వాడండి: BRS నేతలకు KCR ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ గ్రోక్‌ను వాడాలని.. టెక్నాలజీని వినియోగించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ఎప్పటికప్పుడు సాంకేతికంగా అప్‌డేట్ అవ్వాలన్నారు. గ్రోక్‌లో ఎలాంటి సమాచారం అయినా దొరుకుతుందని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. పలు అంశాలపై రెండు జిల్లాల ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోనే ఉండాలని.. ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు.

మళ్లీ మనదే అధికారం

రాష్ట్రంలో మళ్లీ మనదే అధికారమని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేసీఆర్ చెప్పారు. ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ ఉంటుందని.. కాంగ్రెస్ ఏ కోశాన కూడా పోటీలో ఉండదని అన్నారు. అన్ని నియోజకవర్గాలు సైతం బలంగా ఉన్నాయని.. అందరం బ్రహ్మాండంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వార్ వన్ సైడ్ ఉండక తప్పదన్నారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకోలేదని.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతటి వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. 15 నెలల కాలంలోనే మళ్లీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని.. అన్నింటా మన పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. 11 నెలల కాలంలోని బీజేపీ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మోడీ వల్ల దేశవ్యాప్తంగా రైతులు చనిపోయారని.. చివరకు ప్రధాని క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. హెచ్‌సీయూలో జంతువులే లేవని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నదని.. అక్కడ అన్ని రకాల జంతువులు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో హరితహారం చేపట్టామని తెలిపారు. తాము సైతం పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదని చెప్పారు. మొత్తంగా పాలనలో కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయ్యాయని అన్నారు.

ఉమ్మడి కరీంనగర్‌కు 1,75,000 జనం టార్గెట్

చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించాలని.. సభకు భారీ ఎత్తున ప్రజలను తరలించి సక్సెస్ చేయాలని కేసీఆర్ సూచించారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 1,75,000 వేల మందిని తీసుకురావాలని ఆదేశించారు. అలాగే.. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 35వేలకు తగ్గకుండా తరలించాలన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ నిర్వహించని విధంగా ఈ సభ ఉండబోతున్నదని, ఈ సభతో బీఆర్ఎస్ సత్తా చాటుదామని అన్నారు. సభ మీద విపరీతమైన ప్రచారం కల్పించాలని.. గ్రామగ్రామాల వాల్ రైటింగ్స్ రాయించాలని సూచించారు. చలో వరంగల్ పేరిట.. తెలంగాణ నినాదాలతో కూడిన రైటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. రజతోత్సవం సంబరాలు అంబరాన్ని తాకేలా ఉండాలని సూచించారు.

నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు

బీఆర్ఎస్ బహిరంగ సభ కార్యక్రమం ముగిసిన వెంటనే నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రత్యేక నిపుణులతో ఈ శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. అలాగే.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. అందులోభాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నదని.. సభ తర్వాత కమిటీలను ఫైనల్ చేసుకుందామని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డా.కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జోగు రామన్న (ఆదిలాబాద్), బాల్క సుమన్ (మంచిర్యాల), మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్‌రావు, పార్టీ జిల్లాల నాయకులు దావ వసంత, చల్మెడ లక్ష్మీనరసింహారావు, జాన్సన్ నాయక్, రామకృష్ణారెడ్డి, రమాదేవి, కిరణ్ కొమ్మెర, విలాస్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story