నిధులు కొల్లగొట్టేందుకే కేసీఆర్ పక్కా ప్లాన్.. కాళేశ్వరం ప్రజెంటేషన్‌లో CM రేవంత్ నిప్పులు

by Kema Shiva Kumar |

ప్రజాభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నిధులు కొల్లగొట్టేందుకే కేసీఆర్ పక్కా ప్లాన్.. కాళేశ్వరం ప్రజెంటేషన్‌లో CM రేవంత్ నిప్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ పాలిటిక్స్‌లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, వైఫల్యాలు తెరపైకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన అధికారిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరదలకు కాళేశ్వరం మోటారు పంపులు మునిగిపోయిన దృశ్యాలను, ఫొటోలను స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం కేవలం కేసీఆర్ నిధులు కొల్లగొట్టేందుకు వేసిన పక్కా ప్లాన్ అని ఆరోపించారు.

రీడిజైన్ పేరుతో అంచనాల పెంపు..

కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘ప్రాజెక్టు రీడిజైన్‌పై కేసీఆర్ నాడు విశ్రాంత ఇంజినీర్లతో ఒక కమిటీ వేశారని తెలిపారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తే అది తట్టుకోలేదని, నిలవదని ఆ ఇంజినీర్లు స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. దానికి బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే కొంతమేర పర్వాలేదని సూచించారని తెలిపారు. కానీ కేసీఆర్ ఆ నివేదికలను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. తనకు కావాల్సిన విధంగా నివేదిక ఇవ్వాలంటూ వ్యాప్కోస్ (WAPCOS) సంస్థపై ఒత్తిడి తెచ్చారని సీఎం వెల్లడించారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు అంచనాను ఏకంగా రూ.81 వేల కోట్లకు పెంచేశారని, చివరకు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందని కాగ్ (CAG) నివేదికే స్పష్టం చేసిందని సీఎం గుర్తుచేశారు. ఇంత ఖర్చు చేసినా ఆయకట్టు కానీ, నీళ్లు కానీ పెరగలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

నిర్మాణ లోపాలు.. ఇసుకపై బ్యారేజీలు

కాళేశ్వరం తన ‘బ్రెయిన్ చైల్డ్’ అని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఆ అబద్ధాలను నాటి గవర్నర్ కూడా గుడ్డిగా నమ్మారని సీఎం ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఏడాదిలోనే నిర్మాణ లోపాలు బయటపడ్డాయని రేవంత్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ వద్ద సీసీ బ్లాకులను సరిచేయాలని ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి 2020లోనే కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కానీ, నాటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థ కూడా మరమ్మతులు చేయలేదన్నారు. ఫలితంగా 2022 గోదావరి వరదలకు కన్నెపల్లి పంపుహౌస్‌లు మునిగిపోయాయని అన్నారు. ఆ వెంటనే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ ఆరు పిల్లర్లు కుప్పకూలాయని సీఎం రేవంత్ వివరించారు. సాధారణంగా ఏవైనా బ్యారేజీలు లేదా డ్యామ్‌లు కడితే వాటిని విడతల వారీగా 25 శాతం చొప్పున నీటిని నింపుతూ పరీక్షిస్తారని, కానీ కేసీఆర్ మాత్రం కట్టిన ఏడాదే బ్యారేజీలను పూర్తిగా నింపేశారని మండిపడ్డారు. అసలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద ఆయకట్టే లేదని, కేవలం ఇసుక మీదనే బ్యారేజీలు కట్టడం వల్ల, హడావుడిగా నీళ్లు నింపడం వల్ల ఒత్తిడి పెరిగి ప్రాజెక్టు కుంగిపోయిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

విచారణ ముమ్మరం.. నివేదిక ఆధారంగా చర్యలు

ప్రాజెక్టుల నిర్మాణంలో ఏ దశలోనూ నిబంధనలు పాటించలేదని, భూమి లోపల ఉన్న బలాన్ని పరీక్షించమని ఎన్‌డీఎస్ఏ (NDSA) చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరుగుతోందని, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇప్పటికే కేసీఆర్, హరీశ్ రావులతో పాటు అధికారులను విచారణకు పిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story