- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ శాఖలో ఖాళీలెన్ని.. భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు: హైకోర్టు
రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని వాటి భర్తీ కోసం తీసుకుంటున్న చర్యలు, జారీ చేస్తున్న నోటిఫికేషన్ల వివరాలు ఏమిటి తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని వాటి భర్తీ కోసం తీసుకుంటున్న చర్యలు, జారీ చేస్తున్న నోటిఫికేషన్ల వివరాలు ఏమిటి తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.
భర్తీ చేయకపోవడం చట్టవిరుద్ధం..
రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో భారీ సంఖ్యలో పోస్టులు మంజూరైనప్పటికీ.. వాటిని సకాలంలో భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీతినేడి అఖిల్ శ్రీగురుతేజ హైకోర్టులో ప్రజాప్రయోజన పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..
పోలీసు శాఖలో ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకుండా వదిలేయడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది న్యాయ సూత్రాలకు, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21, 41తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు, ఉత్తర్వులకు పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. మంజూరైన ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే, ప్రతి సంవత్సరం నియామకాల కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్, జాబ్ క్యాలెండర్ రూపొందించి, పక్కా షెడ్యూల్ ప్రకారం నియామక ప్రక్రియను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనానికి విన్నవించారు.
ప్రభుత్వం పరిశీలిస్తోంది..
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ..నియామకాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కోర్టుకు వివరించారు. పోలీసు శాఖను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే తాజాగా 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తుచేశారు. మిగతా ఖాళీల అంశాన్ని కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని వివరించారు.
పూర్తి నివేదిక వచ్చాకే..
స్పెషల్ జీపీ వాదనల అనంతరం.. మిగిలిన ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్ న్యాయవాది మరోసారి కోరారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తాజాగా 7 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఖాళీలు, భర్తీ ప్రక్రియపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. కౌంటర్ దాఖలుకు వారం రోజుల గడువు ఇచ్చి, తదుపరి విచారణను వాయిదా వేసింది.






