- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIIT Bengaluru: రూ. 1.5 కోట్ల ప్యాకేజీతో ఐఐఐటీ బెంగళూరు విద్యార్థికి బంపర్ ఆఫర్
ఈ క్యాంపస్‌లో మరో ఇద్దరు విద్యార్థులు కూడా తలో రూ. 1.3 కోట్లతో 'కోటి రూపాయల క్లబ్'లో చేరారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత విద్యాసంవత్సరం ప్లేస్‌మెంట్ సీజన్‌లో బెంగళూరులోని ఐఐఐటీ-బీ (ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సరికొత్త చరిత్ర సృష్టించింది. సంస్థకు చెందిన ఒక ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విద్యార్థి ఏకంగా రూ. 1.5 కోట్ల వార్షిక ప్యాకేజీని దక్కించుకుని క్యాంపస్ చరిత్రలోనే రికార్డు నమోదు చేశారు. ఈ మెగా ఆఫర్ దేశంలోని పలు కొత్త, మూడో తరం ఐఐటీల గరిష్ట ప్యాకేజీల కంటే చాలా ఎక్కువ కావడం విశేషం. ఈ క్యాంపస్‌లో మరో ఇద్దరు విద్యార్థులు కూడా తలో రూ. 1.3 కోట్లతో 'కోటి రూపాయల క్లబ్'లో చేరారు. అంతేకాకుండా, 22 మంది విద్యార్థులు రూ. 60 లక్షల కన్నా ఎక్కువ ప్యాకేజీలు సాధించగా, రూ. 20 లక్షల కంటే ఎక్కువ జీతాలతో 110 మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందారు. ఐఐఐటీ-బీ 26వ స్నాతకోత్సవంలో ఈ ప్లేస్‌మెంట్ గణాంకాలను ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 316 మంది పట్టభద్రులయ్యారు. వారిలో 95 మంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, 175 మంది ఎంటెక్, 32 మంది ఎంఎస్సీ(రీసెర్చ్) పూర్తి చేయగా, 14 మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు.
స్నాతకోత్సవంలో కవల సోదరులు సిద్ధార్థ్, సంకల్ప్ కొఠారి ఒకేసారి ఎంటెక్ పట్టాలు అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే సిద్ధార్థ్ ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థిగా గోల్డ్ మెడల్ సాధిస్తే, సంకల్ప్ సామాజిక సేవకు గాను ఇన్‌స్టిట్యూట్ మెడల్ అందుకున్నారు. విద్యాపరంగా సింగురు మనోజ్ఞ, శుభజీత్ లహిరిలు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. అలాగే, రోబోటిక్ న్యూరోసర్జరీపై పరిశోధన చేసినందుకు గాను ప్రసిద్ధ న్యూరోసర్జన్ వికాస్ వళయిల్ ఈ సంస్థ నుండి 100వ పీహెచ్‌డీ పట్టా అందుకోవడం మరొక అరుదైన మైలురాయి. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ దేబబ్రత దాస్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా తమ క్యాంపస్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) విభాగాన్ని ఏర్పాటు చేశామని, తాము రూపొందించిన 'టెలి-మానస్' ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటివరకు 40 లక్షలకు పైగా ఉచిత మానసిక ఆరోగ్య సంరక్షణ కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు.






