భూ భారతిలో బాహుబలి స్కామ్ ..పొంగులేటి రాజీనామా చేయాల్సిందే

by velandi.Saikiran |

భూ భారతి స్కామ్.. బాహుబలిలాంటి స్కామ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.

భూ భారతిలో బాహుబలి స్కామ్ ..పొంగులేటి రాజీనామా చేయాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ భారతి స్కామ్.. బాహుబలిలాంటి స్కామ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అధికారులతో రికార్డులు తారుమారు చేయిస్తున్నారని.. భూ భారతిపై పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేయాలని అన్నారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి మాఫియా గ్యాంగ్‌ల కాల్ డేటాను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. భూ భారతి పోర్టల్ వచ్చిన తర్వాత రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భూ భారతి పోర్టల్‌లో 22వేల భూ బదలాయింపులు జరిగాయని ఆరోపించారు. భూమి యజమానులకు సంబంధం లేకుండా పోర్టల్‌లో మార్పులు చేశారని పేర్కొన్నారు. రైతులు తమ భూమి ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలని కోరారు.

కీలకమైన శాఖలు రేవంత్‌రెడ్డి, పొంగులేటి వద్దే ఉన్నాయని.. ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పోర్టల్ మార్పు చేశారని.. శేరిలింగంపల్లిలో 13 గుంటల భూమిని సహస్ర ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 200 ఎకరాలకుపైగా భూమిని బదలాయింపు చేశారని పేర్కొన్నారు. 50 శాతం వాటాలు పంచుకుంటున్నారని అన్నారు. రూ.10 వేల కోట్ల కుంభకోణంపై రెవెన్యూ మంత్రి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. భూ భారతి అక్రమాలపై అధికారుల కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భూ భారతి బాధితులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగబాలు, దాసరి ఉష, గోపగాని రఘురాం, మంద శ్యామ్ పాల్గొన్నారు.

Next Story