- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్‌ఎస్పీకి హైకోర్టులో ఊరట.. అప్పటి వరకు ఆయన వద్దే బుల్లెట్ ప్రూఫ్
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఆయన పెట్టుకున్న వినతిపత్రంపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓ నిర్ణయం తీసుకునే వరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన వద్దే కొనసాగించాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆ వాహనం అవసరం లేదని ప్రభుత్వం భావిస్తే, ముందుగా అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసి, ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రాణహాని ఉంది.. నోటీసు ఇవ్వలేదు..
బుల్లెట్ ప్రూఫ్ వాహన భద్రతను వెనక్కి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టీ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. ప్రవీణ్ కుమార్ పోలీసు సర్వీసులో ఉన్నప్పుడు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. యాంటీ నక్సలైట్, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. మావోయిస్టు కార్యకలాపాలను అణచివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు కాబట్టే, ఇప్పటికీ వారి నుంచి ప్రాణహాని పొంచి ఉంది. అలాంటి వ్యక్తికి ప్రాణరక్షణగా ఉన్న వాహనాన్ని కనీసం ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వెనక్కి తీసుకోవడం సరికాదు. దీనిపై గత నెల 23న ప్రభుత్వానికి వినతిపత్రం కూడా సమర్పించాం అని కోర్టుకు వివరించారు.
ఎస్సార్సీ నివేదిక ప్రకారమే కుదింపు..
ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. భద్రత ఉపసంహరణకు గల కారణాలను న్యాయస్థానానికి వివరించారు. ప్రవీణ్‌కుమార్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేసినా, 2+2 బందోబస్తు భద్రతను కొనసాగిస్తున్నామని తెలిపారు. భద్రతా సమీక్షా కమిటీ అంచనా ప్రకారం.. ఆయనకు ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని తేలడంతోనే బీపీ వాహనాన్ని వెనక్కి తీసుకున్నాం. కేవలం ఆయనకే కాకుండా, మాజీ డీజీపీలు, ఇతర సీనియర్ అధికారుల భద్రతను సైతం ముప్పు అంచనా ఆధారంగానే కుదించాం అని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 588 మంది వీఐపీల భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వీరిలో 380 మంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు, 54 మంది పోలీస్ అధికారులు, 75 మంది మాజీ పోలీస్ అధికారులు, 54 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. ఈ సమీక్ష తర్వాత 45 మంది రాజకీయ నాయకులకు కల్పించిన భద్రతను పూర్తిగా ఉపసంహరించామని, మరో 20 మందికి భద్రతా స్థాయిని తగ్గించామని కోర్టుకు నివేదించారు.
డీజీపీదే తుది నిర్ణయం..
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి.. గత నెల 23న ప్రవీణ్‌కుమార్ సమర్పించిన వినతిపత్రంపై డీజీపీ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ సదుపాయాన్ని యథాతథంగా కొనసాగించాలని, వెనక్కి తీసుకోవాలంటే షోకాజ్ నోటీసు తప్పనిసరి అని స్పష్టం చేస్తూ ఈ పిటిషన్‌పై విచారణను ముగించారు.






