- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఇకనైనా అసెంబ్లీకి రా.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదని విమర్శించారు.. సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపై చర్చ జరగాలన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభత్వానికి ఉన్న సంకల్పాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో చేసిన ప్రసంగం చారిత్రాత్మకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు.
రాజ్యాలు పోయినా రాచరిక పోకడే..
సభలో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్షం హుందాగా ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించామని, కానీ వారు అహంకారాన్ని ప్రదర్శించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు పోలేదు.. ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు" అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. విపక్షాల తీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలను నిరాశపరిచేలా ఉందన్నారు.
విపక్ష నేత తీరు రాష్ట్రానికి మాయని మచ్చ
ప్రధాన ప్రతిపక్షం నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. "గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడమే. ఇది రాష్ట్రానికి మాయని మచ్చ" అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించడమే విపక్షాల పనిగా మారిందని ఫైర్ అయ్యారు.
జీతభత్యాలపై సభలో చర్చ జరగాలి
ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ ఇప్పటివరకు కోటి 6 లక్షల రూపాయలకు పైగా జీతభత్యాలు పొందారని, కానీ సభకు మాత్రం రావడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. "కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. విధులకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకునే వారిపై సభలో చర్చ జరగాలి. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.






