- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: గులాబీ బాస్.. బిందాస్! ఫాం హౌజ్‌లో మనవడికి వ్యవసాయ పాఠాలు
‘ఎవరు ఎక్కడ పోతే ఏంటి. బిందాస్.. వాడికేంది.. రంది రవుసు లేదు.. బిందాస్‌గా ఉన్నాడు’ అనేది సామెత.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఎవరు ఎక్కడ పోతే ఏంటి. బిందాస్.. వాడికేంది.. రంది రవుసు లేదు.. బిందాస్‌గా ఉన్నాడు’ అనేది సామెత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూసిన వారంతా ఈ సామెతను గుర్తు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన మనవడు హిమాన్షుకు ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో వ్యవసాయ పనులు నేర్పిస్తూ కేసీఆర్ కనిపించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలు సెటైర్లు వినిపిస్తున్నాయి. పార్టీకి అధ్యక్షుడిగా, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎక్కడ పోతే ఏంటి..? అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉండడంతో ఆయనపై మరింత వ్యతిరేకత పెరుగుతున్నది.
ప్రజలకు శిక్షలా భావిస్తున్న మాజీ సీఎం
‘నన్ను ముఖ్యమంత్రిగా ఓడించడమే ప్రజలు చేసిన తప్పు. ఇక వారికి నేనెందుకు.. నా గురించి వాళ్లకు ఎందుకు.. నేనెందుకు వాళ్ల కోసం ఆలోచించాలి’ అనే రీతిలో కేసీఆర్ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు తన విలువ తెలియాలని, అప్పుడే ప్రజల్లోకి వస్తాననే రీతిలో ఆయనను కలిసిన కొద్దిపాటి నాయకులతో అన్నట్టు సమాచారం. కేసీఆర్‌కు మూడు కీలక పదవులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. కానీ.. ఈ మూడు పదవుల్లో వేటికీ న్యాయం చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. జనాలు సైతం ఆయనను మరిచిపోయినట్టుగా చర్చ మొదలైంది. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎంత పెద్ద నాయకుడైనా ప్రజల్లో ఉంటేనే వాళ్లు ఆదరిస్తారు.. ఎన్నుకుంటారు.. గుర్తింపు ఇస్తారు.. కానీ, ఎన్నికలప్పుడే, ఎన్నికల కోసమే వస్తాను, గెలిపిస్తేనే ప్రజల్లో ఉంటాను అంటే ప్రజలు సైతం అదే రకంగా వ్యవహరిస్తారని, సమాధానం ఇస్తారని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఎమ్మెల్యేగానూ మొఖం చాటు..
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన పదవులతో పాటు గజ్వేల్ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ప్రజలు ఇచ్చిన పదవి. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నారు. ఆయన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా రిజెక్ట్ చేయవచ్చు కానీ.. . ఎమ్మెల్యేగా మాత్రం కేసీఆర్ఉండాలని కోరుకున్నారు. కానీ.. కేసీఆర్ ఎమ్మెల్యే పదవిని సైతం లెక్కచేయడం లేదు. తనను ఎన్నుకున్న ప్రజలకు సైతం న్యాయం చేయడం లేదు. కేవలం ముఖ్యమంత్రిగా ఉండటానికే ఎమ్మెల్యే పదవి అనే రీతిలో వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది. పదవి కోల్పోయి 13 నెలలు అయింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎక్కడా పర్యటించకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, వారి మంచి చేడు, పలకరింపులు, యోగక్షేమాలు తెలుసుకోకపోవడంపై స్థానిక ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తున్నది. మరోవైపు.. కేసీఆర్‌ను కలవలంటే అపాయింట్మెంట్కంపల్సరీ. అది కూడా కొద్ది మందికే అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతుంది.
పార్టీ అధ్యక్షుడిగా ఆయన బయటకు వచ్చినా, రాకపోయినా ఆయన పార్టీ ఆయన ఇష్టం. వారి కార్యకర్తలు ఆయనను నిలదీస్తారు. కానీ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది. ఆ నియోజకవర్గ కష్టసుఖాలు, మంచి చేడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు వ్యక్తిగత, సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. కానీ, 13 నెలలుగా నియోజకవర్గం మొఖం చూడని నేతగా ఆయన గుర్తింపు పొందారు. నియోజకవర్గ నాయకులకు అపాయింట్మెంట్ఉంటేనే ఆయన దర్శన భాగ్యం దొరకడం కష్టం. అది కూడా కొద్ది మందికే.. ఏదో ఒక సందర్భంలో మాత్రమే ఆయన వారికి అపాయింట్మెంట్ఇస్తారని చెబుతున్నారు. కానీ.. మధ్యతరగతి, సామాన్యుల పరిస్థితి ఏంటనేది కనీసం ఆలోచన చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
నెలనెలా ఎమ్మెల్యే వేతనం
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరి 13 నెలలు పూర్తయింది. కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది కూడా 13 నెలలు అయింది. అయితే.. ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతకు ప్రతినెలా రూ2.50 లక్షల వరకు గౌరవ వేతనం లభిస్తుంది. ఇవి నేరుగా ఆయా ఎమ్మెల్యేల అకౌంట్లలో జమ అవుతాయి. ఈ 13 నెలలకు సంబంధించి ఇప్పటివరకు కేసీఆర్‌కు రూ.32 లక్షల వరకు పైగానే వేతనం జమ అయింది. ప్రజలకు సేవ చేయనప్పుడు.. ప్రజలకు అందుబాటులోకి రానప్పుడు ఆ వేతనం తీసుకొని వృథానే కదా అన్న అభిప్రాయాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు..?
ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పార్టీ బలాబలాల ఆధారంగా కేటాయిస్తారు. ఆ పదవిలో ఉన్నా కేసీఆర్ ఏనాడూ మాట్లాడిన దాఖలాలు లేవు. 13 నెలల కాలంలో అసెంబ్లీకి వచ్చిందే ఒక్క రోజు మాత్రమే. ఈ నేపథ్యంలో ఆ పదవి సైతం తనకు ఇష్టం లేదనే రీతిలో చెప్పకనే చెబుతున్నారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నది.. హామీలను ఏ విధంగా అమలు చేస్తున్నది.. తెలుసుకొని ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ.. ఇవేవీ తనకు సంబంధంలేదు అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
సీఎం రేవంత్ ఆహ్వానించినా..
ముఖ్యమంత్రి, మంత్రులు, స్వయంగా స్పీకర్ ఫోన్‌చేసిన ఆహ్వానించినా సమావేశాలకు రాలేదు. తెలంగాణ బిల్లు ఆమోదించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్మరణిస్తే ఆయనకు నివాళి అర్పించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా దానికీ హాజరుకాలేదు. ఆయన సంతాప సూచకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికి రాలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి చనిపోయిన బయటికీ రాలేదు. ఇలా అనేక కీలక ఘట్టాలు, కీలక అంశాల్లో కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితం అయ్యారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరవుతారా లేదా ఒక్క రోజే వచ్చి వెళ్లిపోతారా అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తున్నది. బయటికి వచ్చేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడం లేదా..? లేక ఆయన మనసు ఒప్పుకోవడం లేదా..? అనే కోణంలోనూ చర్చ జరుగుతున్నది.






