బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సభను ప్రతిష్టా్త్మకంగా తీసుకున్నారు. ఇందుకు ఉత్తర తెలంగాణను కేంద్రంగా ఎంచుకున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై కేసీఆర్ శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో సమావేశం అయ్యారు. బహిరంగ నేపథ్యంలో అక్కడి నేతలు చేస్తున్న ఏర్పాట్లపై అధినేత సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లు బాగున్నాయని కొనియాడుతూనే.. మరికొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.

400 మంది కూర్చునేలా వేదిక

రజతోత్సవం సభ కోసం స్థానిక నేతలు అధినేత సూచనల మేరకు నార్త్ ఫేసులో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. 8 ఫీట్ల ఎత్తులో వేదికను నిర్మిస్తుండగా.. 400 మంది కూర్చుండేలా వేదికను తయారు చేస్తున్నారు. ఇందుకోసం 159 ఎకరాలను సిద్ధం చేశారు. గతంలో ఏ పార్టీ సైతం నిర్వహించని రీతిలో సభను నిర్వహించాలని అధినేత సూచించడంతో.. ఆ స్థాయిలో సభా వేదికను సైతం సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా కళాకారుల కోసం ప్రత్యేక స్టేజీని సైతం నిర్మిస్తున్నారు. మరోవైపు.. మహిళలకు ఎక్కడా అసౌకర్యం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి కోసం సెపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. సభకు వచ్చిన వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు.

3,000 డ్రమ్ములు.. 10 లక్షల వాటర్ బాటిల్స్

అసలే ఎండాకాలం కావడం.. సభకు వచ్చిన వారు దాహంతో ఇబ్బందులు పడకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాహార్తిని తీర్చేందుకు 10 లక్షల వాటర్ బాటిల్స్‌తోపాటు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో పెట్టాలని స్థానిక నేతలకు అధినేత కేసీఆర్ సూచించారు. అంతేకాకుండా.. కూల్ వాటర్ అందించేలా 3వేల డ్రమ్ములను అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. నీటి కొరత అనేది ఏర్పడకుండా చూడాలన్నారు. అలాగే.. అనుకోకుండా ఎవరైనా అనారోగ్యానికి గురైనా.. ప్రమాదానికి గురైనా ఫస్ట్ ఎయిడ్ అందించేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ర్యాంపులు

మరోవైపు.. భారీ ఎత్తున నిర్వహిస్తున్న సభ కావడంతో సభకు వచ్చే వారితో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఎక్కడా వాహనాల రాకపోకలు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. వెహికిల్స్ రాకపోకలకు 16 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మిస్తుండగా.. ఇప్పటికే 8 కిలో మీటర్ల నిర్మాణం పూర్తయినట్లు వరంగల్ నేతలు చెప్పారు. దాంతో కేసీఆర్ వారిని అభినందించారు. అప్రోచ్ రోడ్డుతోపాటే ఒకేసారి నిమిషానికి 600 వెహికిల్స్ దిగేలా పెద్ద ఎత్తున ర్యాంపులు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. పార్కింగ్ కోసం కూడా అనువైన ఏర్పాట్లు చేయాలన్నారు.

అలాగే.. 300 చోట్ల హైమాస్ట్ ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు. వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.టెంపరరీ టాయిలెట్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story