జగిత్యాల సభలో కవి అలిశెట్టి కవితను గుర్తుచేసిన కేసీఆర్

by Ramesh Naini |   (  Updated:2026-04-20 15:44:14  IST  )

కేసీఆర్.. జగిత్యాల గడ్డకే చెందిన ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన ఓ స్ఫూర్తిదాయక కవితను ఉటంకించి సభికుల్లో ఉత్సాహం నింపారు.

జగిత్యాల సభలో కవి అలిశెట్టి కవితను గుర్తుచేసిన కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. జగిత్యాలలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్.. జగిత్యాల గడ్డకే చెందిన ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన ఓ స్ఫూర్తిదాయక కవితను ఉటంకించి సభికుల్లో ఉత్సాహం నింపారు. అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవారు. ఆయన ఒక మాట చెప్పారు.. అని కవితను వినిపించారు. ‘‘చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది. గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది’’ అని అలిశెట్టి ప్రభాకర్ కవితను కేసీఆర్ వినిపించారు. సభలో ఉన్న ప్రజలు.. అంతేకాకుండా సభకు బయట రెండితలు ఉన్న జీవన్ రెడ్డి అభిమానుల ఆశిర్వాదంతోని పార్టీలో చేరారని, ఆయన గుండె ధైర్యం ఉన్నవారు కాబట్టి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ లో చేరారని అన్నారు.

ఎవరీ అలిశెట్టి ప్రభాకర్?

కేసీఆర్ ప్రస్తావనతో సామాజిక చైతన్య కవి అలిశెట్టి ప్రభాకర్ జీవితం, సాహిత్య ప్రస్థానం మరోసారి తెరపైకి వచ్చింది. 1956 జనవరి 12న జగిత్యాలలో జన్మించారు. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి, చిన్న వయసులోనే కుటుంబ పోషణ బాధ్యతలు చేపట్టారు. మొదట చిత్రకారుడిగా జీవితం ప్రారంభించి, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా మారారు. జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఫోటో స్టూడియోలు నడిపారు. జగిత్యాల ‘సాహితీ మిత్ర దీప్తి’ పరిచయంతో కవిత్వంలోకి అడుగుపెట్టారు. 1974లో ప్రచురితమైన ‘పరిష్కారం’ ఆయన తొలి కవిత. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు ‘సిటీ లైఫ్’ పేరుతో హైదరాబాద్ నగరంపై ఆయన రాసిన మినీ కవితలు విశేష ప్రజాదరణ పొందాయి. ‘ఎర్ర పావురాలు’ (1978 - తొలి సంకలనం), మంటల జెండాలు, చురకలు, రక్త రేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్.. సెక్స్ వర్కర్ల దయనీయ స్థితిపై ఆయన రాసిన ‘తనువు పుండై... తాను పండై...’ కవిత, అలాగే ‘హృదయ త్రాసు’ కవితలు ఆయనకు కవిగా చెరగని ముద్రను తెచ్చిపెట్టాయి. కళ ప్రజల కోసమే అని నమ్మిన ఈ కవి.. క్షయ వ్యాధి బారిన పడి తన పుట్టినరోజైన జనవరి 12వ తేదీనే (1993లో) కన్నుమూశారు.

కేసీఆర్ నోట మళ్ళీ TRS మాట: అధికారంలోకి రాగానే ఎత్తిపారేస్తామని ప్రకటన

Next Story