KCR: బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ!.. అసెంబ్లీ సమావేశాల వేళ షాకిచ్చిన కేసీఆర్

by Prasad Jukanti |   (  Updated:2025-12-31 09:29:05  IST  )

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని భావించిన కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గులాబీ శ్రేణులకు షాకింగ్‍గా మారింది.

KCR: బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ!.. అసెంబ్లీ సమావేశాల వేళ షాకిచ్చిన కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనవరి 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో (Telangana Assembly Winter Session) కేసీఆర్ (KCR) పాల్గొంటారని ఆశగా ఎదురుచూసిన గులాబీ శ్రేణులకు పార్టీ అధినేత షాక్ ఇవ్వబోతున్నారా? ఇకపై తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వం తోలు ఒలిచేస్తానన్న కేసీఆర్ మళ్లీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారా? తాజాగా ఆయన హైదరాబాద్‌ను వీడి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు (Erravelli Farm House) చేరుకోవడంతో అవుననే సమాధానం వినిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ను వీడి హైదరాబాద్ నంది నగర్ నివాసానికి వచ్చి అసెంబ్లీ తొలిరోజు సభకు హాజరైన కేసీఆర్ నిన్న రాత్రి తిరిగి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.

ఇలా వచ్చి.. అలా వెళ్లారు..

కేసీఆర్ ఈ నెల 21 తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఓ లెక్క రేపటి నుంచి మలో రెక్క నేనే స్వయంగా రంగంలోకి వస్తున్నా.. ప్రజలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తానంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. అటునుంచి ఎర్రవెల్లి వెళ్లిపోయిన కేసీఆర్ గత ఆదివారం హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సభలో కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉన్న గులాబీ బాస్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి తిరిగి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. నిన్న పార్టీ శ్రేణులతో కలిసి వారితో ఫొటోలు దిగిన అధినేత.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లను ప్రకటించారు. ఆ వెంటనే ఎర్రవల్లికి వెళ్లిపోయారు. దీంతో కేసీఆర్ ఇలా వచ్చి వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కీలక సమయంలో ఏమిటీ చర్య?..

ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యలు విన్న ప్రజలు తిరిగి వింటేజ్ కేసీఆర్‌ను చూస్తున్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తూ రేవంత్‌రెడ్డి, చంద్రబాబులను టార్గెట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కేసీఆర్ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారిపోయారు. ఈ క్రమంలో స్టేట్ పాలిటిక్స్ సైతం నీటి అంశం చుట్టే చక్కర్లు కొడుతుండటంతో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ తన సత్తా చూపబోతున్నారని కాంగ్రెస్, బీజేపీలను కార్నర్ చేయబోతున్నారనే చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఆయన ఫామ్‌హౌస్‌కు చేరుకోవడం బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Next Story